Begin typing your search above and press return to search.

బాబు క‌ల‌త​:​ ఎమ్మెల్యేల జంపింగ్ బాధేస్తోంది

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:50 PM GMT
బాబు క‌ల‌త​:​ ఎమ్మెల్యేల జంపింగ్ బాధేస్తోంది
X
పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు - రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్య‌క్షుడు-ఎమ్మెల్యే ప్ర‌కాశ్‌ గౌడ్ హ‌ఠాత్తుగా పార్టీకి గుడ్‌ బై చెప్పి కారెక్కిన నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైద‌రాబాద్‌ లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ లో హుటాహుటిన‌ టీ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేల జంపింగ్‌ - పార్టీ ప‌రిస్థితి - భ‌విష్య‌త్ రాజ‌కీయంపై ఆయ‌న చ‌ర్చించారు.
తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున టికెట్ ఇచ్చి క‌ష్టప‌డి గెలిపించుకున్న వ్యక్తులు పార్టీ మారితే సహజంగానే బాధగా ఉంటుందని చంద్రబాబునాయుడు అంగీక‌రించారు. పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి మారే వారు తమ పదవికి రాజీనామా చేయాలని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. ఎమ్మెల్యేలు - నాయకులు పార్టీ మారినంత మాత్రాన తెలుగుదేశం బలహీనపడదని తెలంగాణలో పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని చంద్రబాబునాయుడు పార్టీ నేత‌ల‌కు ధైర్యం నూరిపోశారు. సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కునే పార్టీ టీడీపీ ఒక్కటేనని, తెలుగుదేశం కార్యకర్తలు మరింత కష్టపడి పనిచేసి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తారని ధీమా వ్య‌క్తం చేశారు.

సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నప్పుడే నాయకుడి గొప్పతనం తెలుస్తుందని బాబు ధైర్యం చెప్పారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కష్ట నష్టాలను ఓర్చుకున్నామని తెలిపారు. 1985లో బీజేపీకి లోక్‌ సభలో ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని, ఆ తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొంటూ తెలుగుదేశం పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అనేక సవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ కార్య‌క‌ర్త‌ల వ‌ల్లే నిలబడిందని కితాబిచ్చారు. నాయకులు ఎందరు పార్టీ వీడి వెళ్లినా కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉన్నారని వారికి న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తామ‌ని హామీ ఇచ్చారు.