Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌..బాబు చెప్పింది విన్నావా?

By:  Tupaki Desk   |   29 Aug 2016 9:16 AM GMT
ప‌వ‌న్‌..బాబు చెప్పింది విన్నావా?
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ తిరుప‌తి స‌భ‌. పూర్తయి మూడ్రోజులు కావాస్తున్న‌ప్ప‌టికీ పవ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఇంకా కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి అండ‌గా ఉన్న ప‌వ‌న్ ఆ పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేశారు.సొంత జిల్లా చిత్తూరు దాంతో పాటు అనంతపురం జిల్లాల్లో చంద్ర‌బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ప‌వన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

ప్రత్యేక హోదాపై పవన్ మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామని, అయితే తాను హోదాపై మాట్లాడటానికి భయపడుతున్నానని పవన్ పేర్కొనడం సబబు కాదని బాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ - వైకాపా నాయకుల మాదిరిగా తాను ఎవరికీ భయపడనన్నారు.‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఎవరికీ భయపడను. నాకు ప్రజలే హై కమాండ్’ అని అన్నారు. అలిపిరిలో మావోయిస్టులు దాడి చేస్తారని తెలిసి కూడా ఎదురెళ్లిన సంగతిని గుర్తుచేస్తూ తాను జీవితంలో ఎవరికీ భయపడలేదని - భయపడను కూడా అని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి 23 సార్లు వెళ్లి ప్రధానమంత్రి మోదీ - హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ - ఇత‌ర కీల‌క మంత్రుల‌ను కలిశానని బాబు గుర్తు చేశారు. హోదా కోసం గత రెండేళ్లుగా కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, అయితే కేంద్రం నుంచి సహకారం అందడం లేదన్నారు.

ఏపీ విభజన సమయంలో రాష్ట్రానికి రూ. 16,000 కోట్లు ఇస్తామని చెప్పారని, అయితే కేవలం రూ. 3,900 కోట్లు మాత్రమే ఇచ్చారని బాబు లెక్క‌లు చెప్పారు. రాజధాని అమరావతి - పోలవరం నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. రైల్వేజోన్ ఇస్తామని ఇంతవరకూ ఇవ్వలేదని తెలిపారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ - వెంకయ్య నాయుడు ప్రత్యేకహోదాపై పోరాడారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో కలసి పనిచేస్తున్నట్లు బాబు వివరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ముంపు గ్రామాలను తమకు ఇవ్వాలని పట్టుపట్టడంతోనే నేడు పోలవరం ప్రాజెక్టు మనకు దక్కిందన్నారు. సొంత జిల్లా వేదిక‌గా త‌న‌పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో బాబు ఒకింత ఘాటుగా స్పందించార‌ని అంటున్నారు.