Begin typing your search above and press return to search.

జగన్ కు బాబు రిటార్ట్ ఎలా ఇచ్చారంటే..?

By:  Tupaki Desk   |   1 Sep 2015 9:49 AM GMT
జగన్ కు బాబు రిటార్ట్ ఎలా ఇచ్చారంటే..?
X
కాస్తంత వ్యంగ్యం.. మరికాస్త దూకుడుతో.. సామాన్యలు సైతం కనెక్ట్ అయ్యే పదాలతో మాట్లాడుతూ.. తన హావభావాలతో ఆకట్టుకునే ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్.. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏ స్థాయిలో విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు రోజులుగా ఏపీ అసెంబ్లీలో అధికార.. విపక్షాల మధ్య హోరా హోరీగా సాగుతున్న నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేకహోదా గురించి విపక్ష నేత జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం సాగింది.

జగన్ వేసిన కౌంటర్ లకు ఏపీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పే ప్రయత్నంలో.. జగన్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏ రేంజ్ లో రియాక్ట్ అయ్యారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

‘‘ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడేందుకు ముందుండేది తెలుగుదేశం పార్టీనే. సెక్షన్ 8 కాకుండా హోదా ఒక్కటే వైఎస్సార్ కాంగ్రెస్ కి కనిపిస్తోందంటే.. వాళ్లెంత దివాళాకోరుతనంగా ఉన్నారో అర్థమువుతంది. ప్రత్యేక హోదానే కాదు.. అన్ని హక్కుల కోసం పోరాడతాం’’

‘‘ఒక రాష్ట్ర ప్రభుత్వంపై మరో రాష్ట్రప్రభుత్వం నిఘా పెట్టే పరిస్థితి రావటం దురదృష్టకరం. నేను జీవితంలో ఏ తప్పు చేయలేదు. అందుకే ఎవరికి భయపడను. నాతో పెట్టుకున్న వాళ్లంతా ఏమయ్యారో మీకు (ప్రతిపక్షాలను ఉద్దేశించి) తెలుసు. రెండు కొంటే ఒకటి ఫ్రీ అన్న చందంగా జైలుకెళ్లిన చరిత్ర మీది (జగన్ ను ఉద్దేశించి). రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడే విషయంలో రాజీ పడేది లేదు’’

‘‘మంత్రాలకు చింతకాయలు రాలవు. జగన్ పగటి కలలు మానుకోవాలి’’

‘‘జ్యోతిష్యుడు ఎవరో జగన్ కు మూడేళ్లలో ముఖ్యమంత్రి అవుతారని చెప్పారంట. జగన్ ఆ భ్రమల్లో బతికేస్తున్నారు’’

‘‘ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునేందుకు అనునిత్యం కృషి చేస్తా. ఏపీ ప్రజలకు రక్షకుడిగా ఉంటా’’

‘‘కేంద్రం నుంచి మీ మంత్రుల్ని ఎప్పుడు తప్పుకుంటారని ఈ మధ్య తెగ అడుగుతున్నారు. రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరమనే పొత్తు పెట్టుకున్నాం. కేంద్రం సహకరిస్తే తప్ప విభజన ఇబ్బందుల్ని ఎదుర్కోలేం. కేంద్రంతో సన్నిహితంగా ఉండేది నా స్వార్థం కోసం కాదు.. కేవలం రాష్ట్రం కోసమే. నా మీదేమీ కేసుల్లేవు’’

‘‘జగన్ మోహన్ రెడ్డిగారు తానేదో.. నేటి తరానికి ప్రతినిధిని అనుకుంటున్నారు. నన్ను ఔట్ డేటెడ్ అంటున్నారు. నేనా..? నెవర్. తానేదో ప్రపంచం అంతా తిరిగానని.. తెలివిగలవాడినని ఆయన భ్రమ పడుతున్నారు. చదువుకోమని విదేశాలకు పంపితే తిరుగుటపాలో వెనక్కి వచ్చేశారు.. ఇవన్నీ వదిలిపెట్టండి. డొంక తిరుగుడు వద్దు. మీ దగ్గరే దైనా సమాచారం ఉంటే.. అది సరైనదే అయితే తప్పకుండా స్వీకరిస్తాం’’