Begin typing your search above and press return to search.

మోడీతో క‌టీఫ్ కు బాబు రెఢీ..?

By:  Tupaki Desk   |   23 Feb 2018 5:12 AM GMT
మోడీతో క‌టీఫ్ కు బాబు రెఢీ..?
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఒక ప్ర‌త్యేక గుణం ఉంది. గుండెల్లో మండుతున్నా.. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే మాట‌లు మాత్రం ఆచితూచి అన్న‌ట్లుగానే ఉంటాయి. తొంద‌ర‌ప‌డి మాట అనేయ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకొచ్చిన తంటా అన్న‌ట్లు బాబు తీరు ఉంటుంది. రేపొద్దున ఎలాంటి ప‌రిస్థితి ఉంటుందోన‌న్న దూర‌పు ఆలోచ‌న‌ల ఆయ‌న‌లో ఒకింత ఎక్కువే.

అలాంటి బాబు నోటి నుంచి మోడీ మోసం చేశార‌న్న మాట రావ‌టం అంత తేలికైన విష‌యం కాదు. ఓటుకు నోటు లాంటి కేసు వ్య‌వ‌హారం ఒక‌వైపు వెంటాడుతూ ఇబ్బంది పెడుతున్నా.. ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోన‌ట్లుగా ఆయ‌న నోటి నుంచి కేంద్రం మోసం చేసింది.. ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని దెబ్బ తీస్తున్నారు.. ఏపీ ఆత్మ‌గౌర‌వానికి భంగం వాటిల్లేలా చేస్తున్నారు.. కేంద్రం చేసిన మోసంపై పోరాడ‌తామంటూ ఆయ‌న నోటి నుంచి వ‌స్తున్న మాట‌ల లెక్క‌లు వేరేన‌ని చెబుతున్నారు.

బీజేపీతో బాబు బంధం దాదాపుగా ముగిసిన‌ట్లేన‌ని చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం మోడీతో క‌టీఫ్ చెప్పేందుకు బాబు డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మోడీతో జ‌త క‌డితే దెబ్బ ప‌డ‌టం ఖాయ‌మ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ.. విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. త‌మ బాధ‌ల్ని అస్స‌లు ప‌ట్టించుకోలేద‌ని ఏపీ ప్ర‌జ‌లు బ‌లంగా విశ్వ‌సిస్తున్న వేళ‌.. బీజేపీతో క‌టీఫ్ చెప్పేయ‌ట‌మే మంచిద‌ని బాబు భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

త‌న ప్లాన్ ను స‌క్సెస్ ఫుల్ గా అమ‌లు చేయ‌టంలో భాగంగా మొద‌ట నిందా ప‌ర్వానికి తెర తీసిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌తంలో ఏపీ బీజేపీ నేత‌లు తొంద‌ర‌ప‌డి రెండు మాట‌లు అన్నా.. తెలుగు త‌మ్ముళ్లు కంట్రోల్ త‌ప్ప‌కుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే ప‌రిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడేమో కేంద్రం మోడీ చేసింది.. ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని ప‌ట్టించుకోవ‌టం లేదంటూ నేరుగా అటాక్ చేస్తున్న తీరు చూస్తే.. బాబు ధోర‌ణిలో వ‌చ్చిన మార్పు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే వ‌చ్చే నెల‌లో కీల‌క ప‌రిణామాలు జ‌ర‌గొచ్చ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మోడీతో క‌టీఫ్ చెప్ప‌టానికి ముందు.. త‌మ బంధానికి వీడ్కోలు చెప్ప‌టానికి అవ‌స‌ర‌మైన కార‌ణాల్ని ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో బ‌లంగా నాటే ప్ర‌య‌త్నాన్ని బాబు చేస్తున్నార‌ని చెబుతున్నారు. త‌న మాట‌ల్ని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు.. త‌న నిర్ణ‌యానికి ప్ర‌జామోదం ఉంద‌న్న న‌మ్మ‌కం క‌లిగిన వెంట‌నే క‌మ‌ల‌నాథుల‌తో క‌టీఫ్ చెప్పేయ‌టం ఖాయ‌మ‌న్న మాట‌ను టీడీపీ వ‌ర్గాలు త‌మ అంత‌ర్గ‌త సంబాష‌ణ‌ల్లో చెబుతున్నాయి.