Begin typing your search above and press return to search.

ఐదుగురు మంత్రులపై వేలాడుతున్న బాబు కత్తి

By:  Tupaki Desk   |   30 Sep 2016 8:04 AM GMT
ఐదుగురు మంత్రులపై వేలాడుతున్న బాబు కత్తి
X
తానెంత కష్టపడుతున్నా.. అందుకు తగ్గ ఫలితం దక్కటం లేదని విపరీతంగా ఫీలయ్యే ముఖ్యమంత్రుల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఒకరు. రోజూ నాలుగైదు గంటల కంటే ఎక్కువ నిద్రపోకుండా అనుక్షణం ఏపీ అభ్యున్న‌తి కోసం తపిస్తున్న తనకు మాదిరే మిగిలిన నేతలంతా పని చేయాలి కదా అన్న అసంతృప్తి బాబులో కాస్త ఎక్కువ. అదెంత వరకూ వెళ్లిందంటే.. తన కుమారుడు.. తన తర్వాత పార్టీ వ్యవహారాల్ని చూసుకునే రాజకీయ వారసుడు నారా లోకేశ్ పని తీరు మీద కూడా బాబు అసంతృప్తి వ్య‌క్త‌మ‌య్యేంత‌గా. ఇలా అసంతృప్తితో ఉన్న ఆయన.. తాజాగా కొందరు మంత్రుల‌పై వేటు వేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

ఏపీలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల అనంతరం ఈ ప్రక్షాళన కార్యక్రమం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. పదవులు రాక అసంతృప్తి చెందుతున్న నేతల లిస్ట్ టీడీపీలో చాలానే ఉంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న నేతలు.. పవర్ వచ్చిన వెంటనే.. తమకు పదవులు లభిస్తాయని ఎవరికి వారు అనుకున్నారు. అందరికి పదవులిచ్చి సంతృప్తి పర్చటం సాధ్యం కాని సంగతి తెలిసిందే. దీనికి తోడు.. కులం.. ప్రాంతం లాంటి లెక్కల నేపథ్యంలో కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో పదవులు ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి వేళ.. పదవులు పొందిన వారి పని తీరు బాగోకపోవటమే కాదు.. వారి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావటాన్ని బాబు తట్టుకోలేకపోతున్నారు.

మరో రెండు టర్మ్ లు అధికారంలో సాగాలన్న తలంపులో ఉన్న బాబు.. తన మంత్రివర్గ సభ్యుల స్పీడ్ సరిపోవటం లేదు. విధి నిర్వ‌హణ‌లో దూసుకెళ్లిపోతూ అన్ని పనులు చక్కదిద్దటంతో పాటు.. ఎలాంటి ఆరోపణలు.. వివాదాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఉంటే.. మరికొందరు నేతల పని తీరు ఏ మాత్రం బాగోలేకపోవటం.. ఇంకొంత మంది మంత్రుల నోటి తీరు పార్టీకి.. ప్రభుత్వానికి చేటు తెస్తుందన్న భావనలో ఉన్న బాబు.. అలాంటి వారికి సంబంధించిన ఒక జాబితా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ లిస్ట్ లోని టాప్ ఫైవ్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. జనవరి చివరి వారం తర్వాత జరిగే స్థానిక ఎన్నికల తర్వాత మంత్రులపై వేటు వేసే కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న ఫిర్యాదులతోపాటు.. ఎన్నికల ఫలితాల ఆధారంగా వేటు వేస్తే.. పదవి కోల్పోయిన వారి నుంచి అసంతృప్తి ఉండదని భావిస్తున్న చంద్రబాబు.. వేటు వేయాలని భావిస్తున్న ఆ ఐదుగురు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న ఊహాగానాలు చూస్తే.. ఇటీవల కాలంలో తరచూ వివాదాలతో సహజీవనం చేస్తున్న ఒక మంత్రితో పాటు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళా మంత్రిపై వేటు పక్కా అని చెబుతున్నారు. ఈ మధ్యనే.. మంత్రులు.. ఎమ్మెల్యేల పని తీరుపై ర్యాంకింగ్ లు ఇచ్చిన బాబు.. అందులో పని తీరు ఏ మాత్రం బాగోలేని మరో ముగ్గురిపైనా వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గ ప్రక్షాళన ద్వారా.. మిగిలిన మంత్రుల్లో చురుకు పుట్టించటంతో పాటు.. పాలనా వేగాన్ని మరింత పెంచాలన్న ఆలోచనలో బాబు ఉన్నట్లుగా తెలుస్తోంది.