ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు బాబు నోట ఆ మాట!

Tue Jan 01 2019 11:49:54 GMT+0530 (IST)

చాలా విషయాల్లో ఇద్దరి చంద్రుళ్ల తీరు ఒకలా ఉన్నా.. స్వాభావికంగా ఇద్దరి తీరు తూర్పు పడమరల మాదిరి ఉంటుందని చెప్పాలి. ఏమైనా బాబు స్కూల్ నుంచి కేసీఆర్ రావటంతో ఆయన తీసుకునే నిర్ణయాలు దాదాపు బాబును పోలి ఉంటాయన్న మాటను చెబుతుంటారు. అయితే.. బాబుకు గతంలో సలహాలు ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు నేరుగా ఆయనతో తలపడుతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. ఇరువురి మధ్య నడుస్తున్న పోరు తెలుగు ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.బాబుపై వ్యంగ్య వ్యాఖ్యలతో పాటు.. ఆయన్ను కేసీఆర్ తిట్టినంత తీవ్రంగా మరే నేతా తిట్టలేదనే చెప్పాలి. బాబుపై విమర్శలు చేసేందుకు కేసీఆర్ ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారని చెబుతారు. పూచిక పుల్లను తీసి పారేసినట్లుగా తనన కేసీఆర్ తీసేస్తున్నా.. బాబు మాత్రం అందుకు ధీటుగా రియాక్ట్ కాలేదన్న విమర్శ ఉంది.

ఓటుకు నోటు కేసు పేరుతో బాబును కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు చెడుగుడు ఆడుకోవటం తెలిసిందే. తాజాగా ఓటుకు నోటు కేసును కేసీఆర్ ప్రస్తావించిన వేళ.. గతంలో మాదిరి కామ్ గా ఉండకుండా బాబు నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్యలు వస్తాయి. ఓటుకు నోటు కేసుపై రియాక్ట్ కావటమే కాదు.. అదేమీ పెద్ద కేసు కాదన్న మాటతో పాటు.. దానికి మించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ మీద పెండింగ్ లో ఉందన్న విషయాన్ని ఆయన చెప్పటం ఆసక్తికరంగా మారింది.

ఓటుకు నోటు కేసుకు ఫోన్ ట్యాపింగ్ కేసు పెండింగ్ లో ఉందన్న విషయాన్ని బాబు గుర్తు చేయటం అంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. హైకోర్టు విబజన నేపథ్యంలో ఓటుకు నోటు కేసు విషయంలో తదుపరి నిర్ణయం వెలువడిన పక్షంలో.. వెనువెంటనే ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకు వచ్చేట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. న్యాయనిపుణులు సైతం ఓటుకు నోటు కేసుతో పోలిస్తే.. ఫోన్ ట్యాపరింగ్ కేసు బలమైనదని.. దానితో తిప్పలు ఎక్కువన్న మాట వినిపిస్తోంది.

గతంలో ఇదే అంశానికి సంబంధించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే పవర్లో ఉన్నప్పుడు ఈ అంశంపై తెర మీదకు రావటం.. చివరకు ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కెలుక్కుంటే కేసీఆర్ కు అలాంటి పరిస్థితి ఇంచుమించుగా ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. అందుకే.. తొందరపడి అదే పనిగా ఓటుకు నోటు కేసు ప్రస్తావన తెస్తే బాబు కంటే ముందుగా బుక్ అయ్యేది కేసీఆరేనన్న వాదన వినిపిస్తోంది. మరీ విషయం కేసీఆర్  నోటీసులో ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.