Begin typing your search above and press return to search.

బాబు థియరీ: ఏపీలో కాంగ్రెస్ దే విజయం

By:  Tupaki Desk   |   5 May 2018 10:49 AM GMT
బాబు థియరీ: ఏపీలో కాంగ్రెస్ దే విజయం
X
ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? ఈ ప్రశ్న ఓసారి సంధించి చూడండి.. వారి వారికి.. ఉండే అభిమానాలను బట్టి.. అధికారంలో ఉన్న తెలుగుదేశం గానీ, అధికారంలోకి రావాలనుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ గానీ గెలుస్తాయని చెబుతారేమో. అంతకుమించి మరీ యువకుల్ని - సినీ అభిమానుల్ని అడిగితే.. పవన్ కల్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి అవుతారని వాదనకు దిగినా ఆశ్చర్యం లేదు. అయితే... చంద్రబాబునాయుడు గారు చెబుతున్న ఒక సరికొత్త రాజకీయ సిద్ధాంతం ప్రకారం ఏపీలో కాంగ్రెస్ లో అధికారంలోకి రావాలి. చదువుతున్న వారికి కామెడీగా అనిపించవచ్చు... కానీ, రాష్ట్రంలో అనివార్యంగా త్రిముఖ పోటీ ఉండబోతున్నది గనుక.. ఈ మూడూ కాకుండా.. మరో పార్టీ విజయం సాధించాలన్నమాట.

చంద్రబాబు అలాంటి సిద్ధాంతమే చెబుతున్నారు. కాకపోతే.. ఏపీ రాజకీయాల గురించి కాదు.. తన సిద్ధాంతాన్ని తెలంగాణ రాజకీయాలకు చెప్పుకున్నారు. అక్కడ తెరాస - కాంగ్రెస్ లతో పాటు తెలుగుదేశం బరిలో ఉండబోతున్నది. త్రిముఖ పోటీ గనుక.. తెరాస కాంగ్రెస్ లు ఓట్లు చీల్చుకోవడంలో తమ పార్టీ లబ్ధి పొందుతుందని.. తెలుగుదేశం గెలిచినా ఆశ్చర్యం లేదని ఆయన తెలుగుదేశానికి స్ఫూర్తి ఇచ్చే ప్రయత్నం చేశారు.

చంద్రబాబు చెప్పినట్లుగా త్రిముఖ పోటీ ఉన్నప్పుడు అత్యంత బలహీనంగా ఉండే పార్టీ కూడా విజయం సాధించడం అనేది నిజమే అయితే.. ఏపీలో ఈసారి చతుర్ముఖ పోటీ కింద భావించాలి. తెలుగుదేశం - వైకాపాలతో పాటు జనసేన, కాంగ్రెస్ కూడా పోటీ పడతాయి. మరి మూడు పార్టీలు బలంగా ఉంటే వారు ఓట్లు చీల్చుకునే క్రమంలో బలహీనమైన నాలుగో పార్టీ విజయం సాధిస్తుందేమో అనుకోవాలి.

చంద్రబాబునాయుడు అంత కామెడీ సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నారంటూ జనం నవ్వుకుంటున్నారు. తెలంగాణలో పూర్తిగా పడకేసి ఉన్న తన పార్టీకి స్ఫూర్తి ఇవ్వడానికి ఇంతకంటె ఆయనకు వేరే మాయమాటలు దొరకలేదా? అని పార్టీ నాయకులే అంటున్నారు. అంతగా ఉంటే.. ఇప్పుడంటే పరిస్థితులు సరిగా లేవుగానీ... మళ్లీ మనకు అనుకూల పవనాలు వీస్తాయని, వెళ్లినవాళ్లంతా తిరిగి వస్తారని అనవచ్చు గానీ.. ఈ రకంగా తామే అధికారంలోకి వచ్చేస్తాం అని మభ్యపెట్టడం ఎందుకు అని పార్టీ వర్గాలే అంటున్నాయి.