Begin typing your search above and press return to search.

బయటకొద్దామని బాబు అన్నారంటే..

By:  Tupaki Desk   |   30 July 2016 10:35 AM GMT
బయటకొద్దామని బాబు అన్నారంటే..
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఏ మాత్రం పరిచయం ఉన్న నేత అయినా ఆయన గురించి ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా చెబుతారు. సమస్యల్ని అంత త్వరగా పరిష్కరించేందుకు ఆయన పెద్దగా ఇష్టపడరు. ఇద్దరు నేతల మధ్య పంచాయితీ నడుస్తుంటే.. వీలైనంతవరకూ నాన బెట్టేస్తారేకానీ.. కరుకుగా మాట్లాడటం కనిపించదు. నేతల మధ్య అధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారితే ఇద్దరిని పిలిపించి.. సౌమ్యంగా మాట్లాడి.. సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తారే కానీ.. వారిపై విరుచుకుపడటం పెద్దగా కనిపించదు.

పార్టీలోని ఇద్దరు నేతల మధ్య పంచాయితీ విషయంలోనే ఇంత ఆచితూచి అడుగులు వేసే చంద్రబాబు.. మోడీ లాంటి నేతతో పెట్టుకోవాలంటే ఎంత ఆలోచిస్తారు? మోడీలాంటి జెయింట్ తో తలపడే సత్తా తనకు లేదన్న విషయంపై బాబు ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీతో తనను తరచూ పోల్చుకునే చంద్రబాబు.. తర్వాతి కాలంలో ఆ పద్ధతిని పూర్తిగా మానుకున్నారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. మోడీ విజన్ ను చంద్రబాబు పొగిడే పరిస్థితి వచ్చింది కూడా. ఈ పరిణామక్రమం చెప్పేదేమంటే.. మోడీ తన అంచనాకు మించిన వ్యక్తి అన్న విషయాన్ని బాబు గుర్తించటమే కాదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీతో సర్దుకుపోవటమే మంచిదన్న భావనకు రావటమే.

అలాంటి బాబు.. మోడీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. నిధులు ఇచ్చే విషయంలో ఎంత చిరాకు పెడుతున్నా ఆయన నోరు విప్పలేదు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు.. కేంద్రంలో పేరుకు మిత్రపక్షమైనా.. ఎలాంటి ప్రయోజనం లేని తీరుపై చంద్రబాబు చాలానే మదన పడుతున్నారు. కేంద్రంలో తాను మిత్రపక్షంగా ఉండటం అంటే.. తన మాటను వీలైనంతగా నెగ్గించుకోవటం మాత్రమే తెలిసిన చంద్రబాబుకు.. ఇప్పుడు ప్రతి విషయానికి ప్రాధేయపడే పరిస్థితి. ఇలాంటివి చంద్రబాబును తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి. అలా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడలేని పరిస్థితి.

విభజనతో బక్కచిక్కిన ఏపీకి కేంద్రం దన్ను లేకపోతే పాలన ఎంత కష్టమో బాబుకు తెలీటమే కారణం. అలాంటి వేళ.. తాజాగా రాజ్యసభలో జైట్లీ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తామేమీ చేయలేమన్న విషయాన్ని తేల్చేసిన క్రమంలో బాబు సహనం దాదాపు నశించిందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు తాను కానీ మౌనంగా ఉన్నా.. కేంద్రం మీద పోరాడకపోయినా అసలుకే ఎసరు వస్తుందన్న విషయాన్ని బాబు గుర్తించినట్లుగా కనిపిస్తోంది. ఏపీ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తే.. పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందనటానికి కాంగ్రెస్ పార్టీ ఉదంతం పెద్ద ఉదాహరణగా ఉన్న నేపథ్యంలో మోడీతో ముఖాముఖికి బాబు రెఢీ అయినట్లుగా చెప్పొచ్చు.

ఈ కారణంతోనే శుక్రవారం ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్న చంద్రబాబు.. అవసరమైతే కేంద్రం నుంచి బయటకు వచ్చేద్దామన్న మాటను చెప్పేయటంగా చెప్పొచ్చు. బాహాటంగా ఈ విషయాన్ని బయటకు చెప్పనప్పటికీ.. పార్టీ అంతర్గత సమావేశంలో బాబు ఈ మాట అన్న విషయం బయటకు పొక్కిన నేపథ్యంలో బాబు మైండ్ సెట్ ఏమిటన్న మాటకు పార్టీలో కొందరు నేతలు చెబుతున్న మాటేమిటంటే.. కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నా ఏపీకి ఒరిగే లాభం ఏమి ఉండన్న విషయం బాబుకు అర్థమైందని.. మోడీతో జత కట్టి తన పరపతిని పోగొట్టుకునే కన్నా.. కేంద్రం నుంచి బయటకు వచ్చేస్తే ఏపీ ప్రయోజనాల కోసం ఎంతకైనా సిద్ధమన్న విషయాన్ని చెప్పేసినట్లు అవుతుందని.. సెంటిమెంట్ పరంగా పార్టీకి ఇది మరింత ప్లస్ అవుతుందన్న ఉద్దేశమే బాబు చేత ‘బయటకు వచ్చేద్దాం’ అన్న మాటను అనిపించిందని చెబుతున్నారు.