Begin typing your search above and press return to search.

కేసీఆర్ 31... చంద్రబాబు 60 ?

By:  Tupaki Desk   |   25 Oct 2016 7:04 AM GMT
కేసీఆర్ 31... చంద్రబాబు 60 ?
X
తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.. మొత్తం 31 జిల్లాలను ఏర్పాటు చేసి కేసీఆర్ తెలంగాణలో కింగ్ లా మారిపోయారు. కొన్ని చోట్ల వ్యతిరేకతలు, నిరసనలు ఎదుర్కొన్నా కూడా ఎక్కువమందికి సంతృప్తినే మిగిల్చారు కేసీఆర్. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న డిమాండు వినిపిస్తున్నా అదేమీ ఉండదని ఇంతవరకు చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు రూటు మార్చినట్లుగా టాక్. జిల్లాలను భౌగోళికంగా విభజించకుండానే పాలన వికేంద్రీకరణకు మినీ జిల్లాలను ఏర్పాటు చేయడానికి ఆయన ప్లాను చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.

నేరుగా జిల్లాలు పెంచకుండా పాలన వికేంద్రీకరణకు చంద్రబాబు సిద్ధమయినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైందంటున్నారు. మొత్తం 60 మినీ జిల్లాలుగా పాలనను వికేంద్రీకరించాలని చంద్రబాబు నిర్ణయించారని... అధికారిక ఆదేశాలు అందకపోయినా రెవెన్యూ శాఖ ద్వారా దీనికి సంబందించిన కసరత్తు చేయిస్తున్నారని చెబుతున్నారు. రెవెన్యూ డివిజన్‌ను కేంద్రంగా చేసుకుని అన్ని ప్రభుత్వ పథకాల మంజూరు, అమలు, పర్యవేక్షణ అంతా అక్కడి నుంచే జరిగేలా చూడాలని.. కలెక్టర్లు జిల్లాలో అన్ని పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా పర్యవేక్షిస్తున్నారో ఇకపై ఆర్‌డీవోలు రెవెన్యూ డివిజన్‌లో అలా పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీలైనంతవరకూ అత్యధిక శాతం నిర్ణయాలు రెవెన్యూ డివిజన్‌లోనే జరిగిపోయేలా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. మొత్తం 60 రెవెన్యూ డివిజన్లు రాబోతున్నాయని అంటున్నారు.

మరోవైపు డీఎస్పీల స్థాయిని పెంచి ఎస్పీల అధికారాల్లో కొన్నింటిని వారికి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ స్థాయి అధికారుల్లో సమర్థులను ఎంపిక చేసి వారిని ఆర్డీవోలు, డీఎస్పీలుగా నియమించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వీరి పాత్రను కీలకం చేయనున్నారు. త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.