Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను చంద్రబాబే స్వయంగా ఆహ్వానిస్తారట

By:  Tupaki Desk   |   10 Oct 2015 11:17 AM GMT
కేసీఆర్ ను చంద్రబాబే స్వయంగా ఆహ్వానిస్తారట
X
తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు సగం తెరపడింది.... ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి దాయాది రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ వస్తారా రారా..? అసలు చంద్రబాబు ఆహ్వానిస్తారా..? అందరితో పాటు ఆహ్వానించినా తానే స్వయంగా వెళ్లి పిలుస్తారా... ఎవరినైనా పంపిస్తారా? వంటి సవాలక్ష సందేహాలతో తెలుగు ప్రజలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇందులో ఫస్ట్ హాఫ్ కు ముగింపు పలుకుతూ ఏపీ సీఎం చంద్రబాబు తన ఉద్దేశమేంటో వెల్లడించారు. కేసీఆర్ ను తానే స్వయంగా వెళ్లి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తానని ఆయన ప్రకటించారు. దీంతో సగం చర్చలకు తెరపడింది... కేసీఆర్ వస్తారా రారా అన్న చర్చ మాత్రం సాగుతోంది.

నవ్యాంధ్రరాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు ఏపీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. స్వయంగా తానే వెళ్లి కేసీఆర్‌ను కలిసి ఆహ్వానిస్తానని సమావేశంలో ఆయన ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మంత్రులందరికి ఆహ్వాన పత్రం అందించాలని నిర్ణయించారు. మరో వైపు శంకుస్థాపన రోజున ఏర్పాటు చేసే ప్రధాన వేదికపై 15 మందికి మించి ఉండరాదన్న పీఎంఓ సూచన మేరకు వేదికపై ఎక్కువ మంది లేకుండా చూడాలన్నారు. దీంతో ఒకవేళ కేసీఆర్ వస్తే వేదికపై కూర్చోబెడతారా లేదా అన్న కొత్త చర్చకు తెరలేచింది... వేదికపై కూర్చోవాల్సిన 15 మంది అత్యంత ప్రముఖుల్లో కేసీఆర్ కు చంద్రబాబు స్థానమిస్తారా లేదా అన్నది కొత్త ప్రశ్న.

మరోవైపు చంద్రబాబు స్వయంగా ఇంటికొచ్చి పిలిస్తే కేసీఆర్ ఓకే అంటారా... కాదంటారా అన్నది చూడాలి. తన తరఫున ఎవరినైనా పంపిస్తారా... తానే స్యయంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకిస్తారా అన్నది చూడాలి. అయితే... కేసీఆర్ తలస్తే రావడం పెద్ద విషయమేమీ కాదు. ఎందుకు వెళ్లావని ఎవరైనా అడిగినా... ఎందుకు వెళ్లలేదని అడిగినా కూడా సమాధానం చెప్పుకోగలిగే సమర్థుడాయన. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఈ కార్యక్రమానికి హాజరై అక్కడ చంద్రబాబును మించిపోయేలా నవ్యాంధ్ర కోసం నాలుగు మంచిమాటలు చెప్పి మీకేం కావాలంటే అది చేస్తానన్నంత రేంజిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకోవాలన్నా ఆకట్టుకోగలడు. ఇందుకు కారణమూ ఉంది... రాష్ట్రాలు విడిపోయిన తరువాతే గతంలో ఓసారి ఇద్దరు సీఎంలూ కలుసుకున్నప్పుడు కేసీఆర్ నవ్యాంధ్ర గురించి చంద్రబాబుకే సలహాలు ఇచ్చారు... దానికి చంద్రబాబు కూడా అంగీకరించి... కేసీఆర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగిన వ్యక్తి... ఆయనకు ఆంధ్రలో అణువణువూ తెలుసు... ఆయనకు మంచి విజన్ ఉంది.. ఆయన సలహాలు చిన్నవేమీ కావు అని కితాబివ్వాల్సి వచ్చింది కూడా. కాబట్టి చంద్రబాబు తానే వెళ్లి స్వయంగా పిలవాలనుకున్నట్లే కేసీఆరే స్వయంగా ఈ కార్యక్రమానికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సి ఉండదు.

ఇక కేసీఆర్ వస్తారా రారా అన్నది దసరా రోజే తేలబోతోంది... వస్తే ఆయన ఎక్కడ కూర్చుంటారు.. వేదికపైనా కాదా అన్నది మాత్రం చంద్రబాబు చేతుల్లో ఉంది.