Begin typing your search above and press return to search.

గ్రామ‌ పంచాయ‌తీల‌కు పసుపు రంగు

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:30 PM GMT
గ్రామ‌ పంచాయ‌తీల‌కు పసుపు రంగు
X
ఇది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మార్క్ నిర్ణ‌యం. విప‌క్షాల భాష‌లో చెప్పాలంటే `పచ్చ‌`పాత నిర్ణ‌యం. త‌మ సొంత పార్టీ ప్ర‌చారం కోసం స‌ర్కారు ధ‌నాన్ని దుబారా చేస య‌త్నమ‌ని అంటున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే...గ్రామ పంచాయతీ కార్యాలయాలన్నింటికీ ఒకే రంగు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ గ్రామంలో ప్రవేశించినా పంచాయితీ కార్యాలయం అంటే ట‌క్కున గుర్తుకు రావాల‌ని... ప్రజలు సులువుగా కార్యాలయాలను గుర్తించేందుకు వీలుగా ఆయా భవనాలకు ఒకే రంగు వేయాలని నిర్ణయిస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్‌ - గ్రామీణ అభివృద్దిశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి ప‌సుపు రంగును ఎన్నుకోవ‌డం వివాదంగా మారింది.

ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా కస్తూర్బా పాఠశాలలు - మోడల్‌ పాఠశాలలు ఇప్పటికే ఒకే రంగులో ఉంటున్నాయి. అదే తరహాలో గ్రామ పంచాయతీ కార్యాలయాలు కూడా చూడగానే గుర్తించాలనే ఉద్దేశంతో భవనానికి అంతటికీ పసుపురంగు అలాగే ఎరుపు - తెలుపు రంగుల్లో బోర్డర్లు వేయాలని ప్రభుత్వం సూచించింది. అలాగే ఏ కంపెనీ రంగు వాడాలో కూడా ఉత్తర్వుల్లో సూచించింది. గ్రామాల్లో ఉండే రక్షిత మంచినీటి పథకాలకు సైతం ఖచ్చితంగా ఇవే రంగులు వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు స‌మాచారం. అయితే ఈ ప‌రిణామం బాబు టీం ప్ర‌చారానికి ఉప‌యోగ‌ప‌డేద‌ని అంటున్నారు. మ‌రోవైపు ఖ‌జానాకు సైతం భార‌మ‌ని చెప్తున్నారు. తగిన ఆదాయ వనరులులేక ఇప్పటికే అల్లాడుతున్న పంచాయతీలకు ఈ ఆదేశాలు అదనపు భారం కాబోతున్నాయని సర్పంచ్‌ లు వాపోతున్నారు. ఉన్న‌ భారమే మోయలేక తాముంటే ప్రస్తుతం పంచాయతీ భవనాలకు రంగులు వేయాల్సి రావడం మరింత భారం మోపడమేనని సర్పంచ్‌ లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

కాగా, గ్రామాలలోని పంచాయతీ భవనాలకు - నీటి ట్యాంకులకు పసుపురంగు వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చ‌ర్య పార్టీ ప్రచారం కోసమేన‌ని విమ‌ర్శిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ గుర్తు పసుపురంగు అని, ఆ పార్టీ రంగును ప్రతిబింబించేలా పసుపురంగు వేయాలని చూడడం సబబు కాదంటున్నాయి. గ్రామాల్లో ఉన్న ప్రశాంత వాతావరణానికి ఈ నిర్ణయం భంగం కలిగిస్తుందని పలువురు ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. దానికైనా సిద్దమేనని వారు హెచ్చరిస్తున్నారు. గ్రామాలలో పంచాయతీ భవనం ఎక్కడ అంటే ఎవరిని అడిగినా చెబుతారని వాటిని ప్రత్యేకంగా గుర్తించేందుకని సాకు చెప్పి ప్రభుత్వం పంచాయతీలను పార్టీ రంగుతో నింపడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించుకోవాలని, పంచాయతీ భవనాలను పసుపురంగుతో నింపాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని వారు హితవు పలుకుతున్నారు.