Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు రావొద్దంటున్న బాబు!

By:  Tupaki Desk   |   21 May 2019 5:15 AM GMT
త‌మ్ముళ్ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు రావొద్దంటున్న బాబు!
X
తెలుగు త‌మ్ముళ్ల‌కు స‌రికొత్త ఆర్డ‌ర్ వేశారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఓట్ల లెక్కింపు వేళ అభ్య‌ర్థులు.. ఏజెంట్లు పూర్తి స‌మ‌యం తీసుకొని లెక్కింపు కేంద్రాల్లోనే ఉండాల‌ని.. మొత్తం ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి అయ్యే వ‌ర‌కు బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని ఆయ‌న కోరారు. పార్టీ లోక్ స‌భ‌.. అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న ఆయ‌న‌.. లోప‌ల‌కు వెళ్లిన త‌మ్ముళ్లు.. ఫారం 20 (అభ్య‌ర్థులు గెలిచిన త‌ర్వాత ఈసీ అధికారికంగా ఇచ్చే ఫారం) జారీ చేసిన త‌ర్వాతే బ‌య‌ట‌కు రావాల‌ని కోరారు.

టీడీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేస్తున్నా.. బాబు మాత్రం 110 నుంచి 130 వ‌ర‌కు అసెంబ్లీ స్థానాల్లో గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌ని.. 18 ఎంపీ స్థానాల్ని గెల‌వ‌నున్న‌ట్లుగా పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డైనా అసెంబ్లీ స్థానంలో ప్ర‌తికూలంగా ఫ‌లితం వ‌చ్చినా.. మ‌ధ్య‌లో మాత్రం లేచి రాకూడ‌ద‌ని పార్టీ నేత‌ల్ని కోరారు.

మొత్తం కౌంటింగ్ ప్ర‌క్రియ పూర్తి అయ్యే వ‌ర‌కు బ‌య‌టకు రావొద్ద‌ని.. అదే స‌మ‌యంలో అభ్య‌ర్థుల ప‌క్క‌న ఉన్న వారు భావోద్వేగాల‌కు గురి కాకూడ‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కౌంటింగ్ చేస్తున్న స‌మ‌యంలో దృష్టి మ‌ళ్లేలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌న్నారు.

ఈవీఎంల‌లో చివ‌రి రౌండ్ ఓట్లు లెక్కించిన త‌ర్వాతే వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కిస్తార‌ని.. ఈవీఎంల‌లో ఓట్ల‌కు.. వీవీ ప్యాట్ ల‌లో స్లిప్పుల‌కు తేడా వ‌స్తే రీకౌంటింగ్ కు డిమాండ్ చేయాల‌న్నారు. ఈవీఎంల‌లోని ఓట్ల‌ను లెక్కించ‌క ముందే వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంద‌ని..ఈ అంశాన్ని ఎన్నిక‌ల సంఘం ముందుకు తీసుకెళ‌తామ‌న్నారు.

ఈవీఎం.. వీవీ ప్యాట్ నంబ‌ర్లు.. ఓట్ల వివ‌రాలు న‌మోదు చేసిన 17సి ప‌త్రాల్ని కౌంటింగ్ ఏజెంట్లు త‌మ వెంట తీసుకెళ్లాల‌ని.. వాటిలోని వివ‌రాల‌తో ఈవీఎంల వివ‌రాలు స‌రిగా ఉన్నాయా? లేదా అన్న‌ది కూడా చూసుకోవాల‌న్నారు.
బాబు ఇంత క్లియ‌ర్ గా చెప్పిన అంశాల్లో తెలుగు త‌మ్ముళ్లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.