బీజేపీ పెద్ద గీత..కాంగ్రెస్ చిన్నగీత..ఇదే బాబు లాజిక్

Wed May 23 2018 19:09:41 GMT+0530 (IST)

కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కారణంగా కేసీఆర్ కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదు. నవీన్ పట్నాయిక్ కూడా దాదాపు ఇలాంటి కారణాలతోనే డుమ్మా కొట్టారు. కానీ.. కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతంతోనే పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఆ కార్యక్రమానికి వెళ్లడమే కాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చేయీచేయీకలిపారు.. భుజం తట్టారు.. ముచ్చట్లు చెప్పుకొన్నారు. నిన్నమొన్నటి వరకు రాష్ట్రాన్ని విభజించిన పార్టీ అంటూ శాపనార్థాలు పెట్టిన నోటితోనే అభినందనలు తెలిపారు. చంద్రబాబు స్టాండు మారిందనడానికి ఇది సంకేతమని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
    
బీజేపీతో చెడిన తరువత చంద్రబాబు క్రమంగా కాంగ్రెస్ పట్ల సానకూల ధోరణి చూపుతూ వస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెల్చుకోలేకపోయింది. పార్టీ ఉనికిలో లేకుండా పోయారు. జనం ఆ పార్టీని చీకొట్టారు. మరి.. అయిదేళ్లలోనో అంతా మర్చిపోయి ఆ పార్టీతో కలిస్తే జనం స్వీకరిస్తారా..? చంద్రబాబు ఎందుకింత సాహసం చేస్తున్నారన్న అనుమానం వస్తుంది. కానీ.. చంద్రబాబు బీజేపీపై పగతో కాంగ్రెస్ మోసాన్ని మర్చిపోతున్నారు.
    
ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవడంతో జనంలో ఆగ్రహం పెల్లుబుకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. కానీ.. రాష్ట్రంలో పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా లేవు. వైసీపీ బలంగా ఉంది. 2014లో తనతో ఉన్న పవన్ ఇప్పుడు దూరమయ్యారు. దీంతో ఓటమి భయంతో చంద్రబాబు కాంగ్రెస్ కు చేరువవుతున్నారు. రాష్ట్రాన్ని విభజించినా ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న వాదనతో ఆయన ఆ పార్టీతో కలవనున్నట్లు తెలుస్తోంది. విభజనను వెనక్కు తీసుకోలేం కానీ.. ప్రత్యేక హోదాను సాధించుకోగలమన్న వాదనను ఆయన ఎత్తుకుంటారని భావిస్తున్నారు. దీంతో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చేసిన మోసం ముందు కాంగ్రెస్ విభజన పాపాన్నిచిన్నది చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారన్నమాట.