గతాన్ని ప్రజలు మరుస్తారా బాబూ.?

Fri Nov 02 2018 12:43:02 GMT+0530 (IST)

దశాబ్ధాలుగా ఢిల్లీ పెద్దల అడుగులకు మడుగులు ఒత్తుతూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి పురుడుపోశాడు అన్న నందమూరి తారక రామారావు.. . పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అఖండ మెజార్టీతో గద్దెనెక్కించాడు. టీడీపీలో నరం నరం.. కణం.. కణం .. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉద్భవించిందే.. ఎన్టీఆర్ ను కూలదూసి బాబు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాక విలువలు - విశ్వసనీయతను కూలదోశాడు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదులపై ఉద్భవించిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడే అవే పునాదులపై కలిసిపోయే దుస్థితికి దిగజార్చాడు. ఎన్టీఆర్ బతికుంటే ఈ హఠాత్ పరిణామానికి మరోసారి గుండెపోటు వచ్చి ఉండేదేమో..అధికారమే పరమావధిగా సాగుతున్న ఈ స్వార్థ రాజకీయ క్రీడలో కాంగ్రెస్ తో వేసిన ఈ ఘోర తప్పటడుగు తెలుగుదేశం పార్టీని అధ: పాతాళానికి పడవేయడం తథ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం కాంగ్రెస్-టీడీపీ చెలిమి చూశాక ప్రతి నోటా ఇదే మాట వినిపిస్తోంది..

రాహుల్ గాంధీ పప్పు - దేశానికి ఇటలీ శని.. అంటూ సోనియా - రాహుల్ గాంధీని విమర్శించిన చంద్రబాబు నోరు.. ఇప్పుడదే వారుంటున్న 10 జన్ పథ్ లోకి వంగి వంగి వెళ్లి రాహులే మా నాయకుడు అంటూ కీర్తించాల్సిన దుస్థితికి ఎందుకు వచ్చాడన్నదే ప్రశ్న.? ఇదంతా బీజేపీని ఓడించడానికేనంటూ కొత్త పల్లవి పాడారు.

నాలుగేళ్లుగా బీజేపీతో చెట్టాపట్టాలేసుకొని ఇప్పుడు ఏడాదిగా కలహించుకుంటూ బాబు కాంగ్రెస్ తో కలవడం.. కాషాయాన్ని కాలగర్భంలో కలిపేయడంటూ కత్తులు నూరుతున్నారు. ఇదే సమయంలో గతం గురించి తాముపట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దులిపేసుకోవడం విశేషం.

అవసరాలే ప్రాతిపదికగా.. ఆత్మరక్షణ అత్యవసరంగా చంద్రబాబు పరితపిస్తూ స్వార్థ రాజకీయాలతో చంద్రబాబు కాంగ్రెస్ తో జతకట్టడం తెలుగునాట అందరినీ షాక్ కు గురిచేస్తోంది. టీడీపీ సీనియర్ నేతలు కూడా బద్ధ శత్రువైన కాంగ్రెస్ తో కలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

‘గతంతో మాకు సంబంధం లేదు. ’ అంటూ రాహుల్ - చంద్రబాబు చెప్పిన మాటలను వాళ్లు మరిచిపోయినా ప్రజలు మాత్రం మరిచిపోలేదు. స్వార్థ బీజాలతో పొడచూపిన ఈ అసంబద్ధమైన పోత్తులపై మరి కొన్ని నెలల్లో ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రయోగించి.. పొత్తులన్నింటిని చిత్తు చేసి గతం గుర్తొచ్చేలా షాక్ ఇచ్చేందుకు ఓటరు మహాశయుడు సిద్ధమైపోయాడు. ఈ విషయాన్ని మాత్రం బాబు మరిచిపోకుంటే మంచిది.