ఇచ్చేవాడికి అడిగే వాడు లోకువ..

Sun Feb 18 2018 12:00:02 GMT+0530 (IST)

ఇచ్చేవాడికి అడిగేవాడు లోకువ అని సామెత. అవును మరి.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల వారు మా సంగతి కాస్త పట్టించుకోండి మొర్రో అని ఎన్నిరకాలుగా మొరపెట్టుకుంటున్నా.. వారి గోడు బధిర శంఖారావం లాగా వృథా అవుతున్నదే తప్ప చంద్రబాబు దానిని నామమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో తనకు వస్తున్న వినతుల పట్ల ఆయన ఎలా చులకనగా వ్యవహరిస్తున్నారో.. ఆయన వినతుల పట్ల మోడీ కూడా అదేమాదిరి చులకనగా స్పందిస్తున్నారు. ఇక్కడ బాబు అనుసరిస్తున్న పాఠమే.. అక్కడ మోడీ కూడా అనుసరిస్తున్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి విజ్ఞప్తులు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల భావోద్వేగాలను - మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే అన్నట్లుగా చేయగల అభివృద్ధి మొత్తాన్నీ అక్కడే కేంద్రీకృతం చేసేస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలాంటి అపసవ్యపు ఆలోచనలతో అభివృద్ధిని వికేంద్రీకరించకుండా.. రాష్ట్రాన్ని అసమతుల్య అసమంజస పరిస్థితుల్లోకి నెట్టడం ఇవాళ కొత్తేమీ కాదు. గతంలో ఆయన తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదేమాదిరిగానే మొత్తం అభివృద్ధిని హైదరాబాదులోనే చేపట్టారు. అసలు చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిని వికేంద్రీకరించకపోవడం వల్లనే హైదరాబాదు బాగా డెవలప్ అయ్యాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండు పుట్టిందనే వాదన ఉంది. అప్పట్లో సీమాంధ్రులంతా హైదరాబాదుపై హక్కులు కావాలంటూ.. రోడ్లెక్కే దుస్థితి వచ్చిందంటే బాబు పుణ్యమే. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. రాయలసీమకు హైకోర్టు దక్కాలనడం అర్హమైన డిమాండే అయినప్పటికీ.. సీఎం ఏమాత్రం పట్టించుకోకపోవడం ఘోరం అని పలువురు ఆవేదన చెందుతున్నారు.

ఇక్కడ వెనుకబడిన ప్రాంతం వారి డిమాండును ఆయన ఏ రకంగా అయితే చులకనగా చూస్తున్నారో.. ఆయన పట్ల కేంద్రం కూడా అదేమాదిరి  చులకనగా వ్యవహరిస్తునదని.. అక్కడ మాత్రం.. మోడీ వైఖరిని తప్పుపడుతున్న చంద్రబాబు.. రాయలసీమ విషయంలో తాను చేస్తున్నది కూడా అదే తప్పు అనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.