Begin typing your search above and press return to search.

ప్రజాతీర్పు అంటే ఏమిటో అర్థమైందా బాబు?

By:  Tupaki Desk   |   22 March 2017 4:59 AM GMT
ప్రజాతీర్పు అంటే ఏమిటో అర్థమైందా బాబు?
X
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అనూహ్య రాజకీయ పరిణామాలకు తెర తీశాయి. నిత్యం తనకు తిరుగు లేదన్నట్లుగా చెప్పుకునే చంద్రబాబు మాటల్లో నిజం ఎంతన్నది తాజా ఎమ్మెల్సీ ఎన్నికలు స్పష్టం చేశాయని చెప్పాలి. మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. వాటిల్లో మూడు పరోక్ష పద్ధతిలో జరగ్గా.. ఐదు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరిగాయి.

ఇతర పార్టీ గుర్తుల మీద గెలిచిన ప్రజాప్రతినిదుల్ని సవాలచ్చ మార్గాల ద్వారా తమకు అనుకూలంగా మార్చుకొని క్రాస్ ఓటింగ్ కు తెర తీసి విజయం సాధించిన వైనం ఒక ఎత్తు అయితే.. అందుకు భిన్నంగా ఓటర్లే నేరుగా ఓట్లు వేసిన ఎన్నికల్లో అధికారపక్షానికి షాకిస్తూ ప్రజాతీర్పు రావటం మరో పరిణామం.

నిత్యం ఆదర్శాలు వల్లించే చంద్రబాబు..తాజా ఎన్నికల ఫలితాల్నిఎలా విశ్లేషిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నోరు తెరిస్తే చాలు.. హైదరాబాద్ ను తానే కట్టించానని.. హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులన్నీ తన కారణం వల్లే వచ్చాయని చెప్పుకునే చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రిగా తాను అవిశ్రాంతంగా కష్టపడుతున్నట్లుగా చెబుతారు. తనకు ప్రజల అండ దండిగా ఉందని.. రానున్న 2019 ఎన్నికల్లో భారీ విజయం సాదించటమే కాదు.. రానున్న అన్ని ఎన్నికల్లో తమదే విజయమంటూ విచిత్రమైన ధీమాను వ్యక్తం చేస్తారు. రాజకీయాల్లో ఉండేంత అనిశ్చితి మరెక్కడా ఉండదు. కానీ.. ఆ చిన్న విషయన్ని సైతం చంద్రబాబు మర్చిపోయినట్లుగా ఆయన మాటల్ని వింటే ఇట్టే అర్థం అవుతుంది.

తాజాగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్ష పద్ధతిలో జరిగిన మూడు ఎన్నికల్లో అధికార టీడీపీ విజయం సాధిస్తే.. మిగిలిన ఐదు ఉపాధ్యాయ.. పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం అధికారపక్షం ఘోరంగా ఓడింది. అధికారపక్షం మద్దతు పలికిన బీజేపీ అభ్యర్థి ఒక్క స్థానంలో విజయం సాధించారు. పరిమిత సంఖ్యలో వివిధ వర్గాల వారు వేసిన ఓట్లతో గెలుపోటములు డిసైడ్ అయ్యే ఈ ఫలితాల్ని చూస్తే.. ఏపీ సీఎం నిత్యం చెప్పే మాటల్లో డొల్లతనం ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు.. తాజా ప్రజాతీర్పుపై చంద్రబాబు స్పందిస్తే మరింత బాగుంటుంది. ఆ పని చంద్రబాబు చేయగలరా? అంత ధైర్యం ఆయనకుందా? అన్నది ప్రశ్న. ప్రజాక్షేత్రంలో బాబు పాలనపై ఎంతటి వ్యతిరేకత ఉందన్న విషయన్ని చెప్పే ఈ ఫలితాలు రానున్నరోజుల్లో ఏపీ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని ప్రభావితం చేయటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/