Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు రిజర్వేషన్ల పరేషాన్

By:  Tupaki Desk   |   8 Feb 2016 6:55 AM GMT
చంద్రబాబుకు రిజర్వేషన్ల పరేషాన్
X
కరవమంటే కప్పకు కోపం..విడమంటే పాముకు కోపం అనేరీతిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో పరిస్థితులు ఉన్నాయి. కాపులు తమకు మద్దతు ఇస్తే బీసీలో చేర్చుతామని అదేవిధంగా ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేసి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేశారు. ఎన్నికలలో గెలిచిన తరువాత ఏడాది తిరగకుండానే కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి వెంటనే బీసీల లో చేర్చే అంశంపై మంజునాథ కమిషన్ ను వేశారు. దీంతో రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించినట్లే అయింది.... అయితే... అంతలోనే ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఇటీవల తునిలో కాపు ఐక్యగర్జన ఏర్పాటు.. విధ్వంసం.... ఇప్పుడు ఆమరణ దీక్ష వంటి పరిణామాలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రమంతా ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు టీడీపీలోనూ కాపు - బీసీ నేతల మధ్య వాతావరణం గంభీరంగా ఉందని వినిపిస్తోంది.

కిర్లంపుడిలో మొదలైన కాపు ఉద్యమం తీవ్రమవుతోంది. కాపు గర్జన విధ్వంసం తరువాత ప్రెస్ మీట్ పెట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గోడమీద పిల్లిలా మాట్లాడినా తాజాగా కాపు రిజర్వేషన్ అంశంపై చంద్రబాబు ఏదో ప్రకటన చేయాలని లేకుంటే ఉధ్యమాలు తప్పవని ట్విట్టర్ ద్వారా సందేశాలు పంపారు. ఇక కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి - చిరంజీవి కూడా ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించటానికి వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవికి కాపుల్లో క్రేజ్ ఉంది. చిరంజీవి కాపు సమరానికి మద్దతు తెలిపితే కాపులంతా మరింతగా ఉద్యమించే సూచనలున్నాయి. దాసరి నారాయణరావు కూడా వస్తున్నారు. కాపుల్లో క్రేజ్ ఉన్న పవన్ - చిరంజీవి - దాసరిలు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతుండడంతో వేడెక్కుతుందని భావిస్తున్నారు. మరోవైపు వైకాపా నాయకులైనటువంటి అంబటి రాంబాబు - రామచంద్రయ్య - వంగవీటి రాధ వంటి కాపు నేతలూ ముద్రగడకు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఇది ఎంతవరకు వెళ్తుందో అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.

ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు జరిగేప్రమాదం లేకపోలేదు. దీంతో చంద్రబాబుపై తెలుగుదేశం కాపు నాయకులు ఏదో ఒక ప్రకటన ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే... గత ప్రభుత్వాలు ముస్లిం రిజర్వేషన్లు, ఇతర రిజర్వేషన్లలో వ్యవహరించినట్లుగా కాకుండా ఏమాత్రం అడ్డంకి లేకుండా న్యాయబద్ధంగా చెల్లుబాటయ్యేలా పక్కాగా కాపు రిజర్వేషన్లు పూర్తి చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయన తొందరపాటు వద్దని... కమిషన్ నివేదిక వచ్చేంతవరకు ఆగాల్సిందేనని లేకపోతే ఉపయోగంలేని జీఓలు న్యాయస్దానంలో చెల్లుబాటు కావని చంద్రబాబు అంటున్నారు. ఇది ఒకరకంగా మంచి ఆలోచనే. అయితే... టీడీపీలో కాపు నేతలు మాత్రం దీనిపై తామేమీ స్పందించకుంటే సామాజికవర్గంలో మద్దతు కోల్పోతామేమో అన్న భయంతో చంద్రబాబుపై ఒత్తిడి పెంచి ప్రకటన ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారు. సీఎంతో జరుపుతున్న వరుస భేటీల్లో వారు అదే తీరుగా చంద్రబాబును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు కాపు తలనొప్పితోనే సతమతమవుతుంటే రెండోవైపు నుండి బిసి ఉధ్యమం బయల్దేరింది. ఇప్పటికే చంద్రబాబు కాపు జపం చేస్తున్నారని.. ఇప్పుడు వారి ఉద్యమానికి బెదిరి ఏదైనా ప్రకటన చేస్తే బీసీలు నష్టపోతారంటూ బీసీలు ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. తెలుగుదేశంలోని బీసీ నాయకులు కూడా వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వటానికి సిద్దపడుతున్నారు. ఇప్పటికే కాపులకు వ్యతిరేకంగా బిసిలు మండల కేంద్రాలలో రిలే దీక్షలు చేపట్టటానికి సిద్దమవుతున్నారు.

కాపులు, బీసీల వివాదంతోనే సతమతమవుతున్న తరుణంలో ఎస్‌ సి వర్గీకరణ అంశం కూడా తెరమీదకు వచ్చింది. గత ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గానికి వర్గీకరించి 'పెద్ద మాదిగ' అవుతానన్న చంద్రబాబు ఇచ్చినమాట నిలబెట్టు కోలేదని మాదిగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఎంఆర్‌ పియస్ అధినేత మందా కృష్ణ మాదిగ అన్ని జిల్లాలకు రిజర్వేషన్ అంశంపై ఆందోళన కార్యక్రమాలు చేయమని సందేశాలిచ్చినట్లు సమాచారం. ఎమ్మార్పీఎస్ ఉద్యమిస్తే వారికి వ్యతిరేకంగా మాల సామాజికవర్గం కూడా ఉధ్యమాలు చేయటానికి సిద్ధపడుతున్నారు. దీంతో నవ్యాంధ్ర కులపోరాటాలకు వేదికగా మారబోతుందా అన్న భయం అందరిలో కనిపిస్తోంది.