Begin typing your search above and press return to search.

జేమ్స్ బాండ్ టెక్నాలజీపై మనసుపడ్డ బాబు!

By:  Tupaki Desk   |   27 July 2017 4:24 AM GMT
జేమ్స్ బాండ్ టెక్నాలజీపై మనసుపడ్డ బాబు!
X
ఒక హాలీవుడ్ చిత్రంలో జేమ్స్ బాండ్ రెండు దేశాల మధ్య ఆయిల్ సరఫరా చేసే గొట్టంలోని ట్రాక్ మీద ఒక చిన్న పరికరం మీద కళ్లు చెదిరే వేగంతో ప్రయాణిస్తూ ప్రేక్షకులను ఓ సంభ్రమానికి గురిచేస్తాడు. అలాంటి జేమ్స్ బాండ్ టెక్నాలజీని అమరావతికి తీసుకువచ్చేస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటున్నారు. హైపర్ లూప్ టెక్నాలజీ అనే ప్రయాణ సాంకేతికతను అమరావతి లో ప్రయోగాత్మకంగా పెట్టడానికి అవకాశాలు చూడాలని ఆయన అధికార్లను పురమాయించారు. ఇది గనుక పూర్తయితే వైజాగ్ కు అమరావతి నుంచి 23 నిమిషాల్లో - తిరుపతికి 25 నిమిషాల్లో వెళ్లిపోవచ్చునంట. అంటే విమానంలో వెళ్లే ప్రయాణసమయం కంటె సగం సమయమే అన్నమాట.

అయితే ఈ హైపర్ లూప్ టెక్నాలజీ అనేది ఆచరణ సాధ్యం కాని ఆలోచన అని, ఒక వేళ ఆచరణలో పెట్టినా సరే.. దానికి కాగల వ్యయానికి, ప్రయాణానికి నిర్ణయించే టిక్కెట్ కు చాలా అవుతుందని, విమానం టిక్కెట్ ధరకంటె చాలా ఎక్కువ ధర నిర్ణయిస్తే తప్ప ఆ ప్రాజెక్టు వర్కవుట్ కాదని అనేక ప్రచారాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలుదేశాలు, మన దేశంలో పలు రాష్ట్రాల పరిధిలో కూడా.. ఈ ప్రతిపాదన వచ్చినా.. సాధ్యాసాధ్యాలు, వయబిలిటీ లెక్కలువేసి.. ఎవ్వరూ దీనిని ఆమోదించలేదని కూడా తెలుస్తోంది. పైగా ఈ హైపర్ లూప్ ప్రయాణంలో భద్రత ప్రమాణాల గురించి కూడా చాలా అనుమానాలు వ్యాప్తిలో ఉన్నాయి.

హైపర్ లూప్ టెక్నాలజీలో గంటకు 900 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చునని చెబుతున్నారు. అయితే ఇది రెండు డెస్టినేషన్స్ మధ్యలో ఏర్పాటుచేసిన ఒక పెద్ద పైపులో ప్రయాణించే వాహనం మాత్రమే. ఫ్రిక్షన్ లేని వాతావరణం సృష్టించే వేగం తగ్గకుండా ఉండే ఏర్పాటుతో ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. అయితే ఆచరణలో అనేక చికాకులు ఉన్న ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబునాయుడు ఎందుకు మనసుపడ్డారో మాత్రం తెలియడం లేదు. ఆయన గతంలో పలుమార్లు హామీ ఇచ్చినట్లుగా అమరావతి నుంచి కొన్ని ప్రధాన నగరాలను కలుపుతూ.. మలుపులు లేని స్ట్రెయిట్ రోడ్లను నిర్మిస్తే సరిపోయే దానికి ఇలాంటి ప్రయోగాత్మక ప్రాజెక్టు పేరిట దుబారా తగదని పలువురు పేర్కొంటున్నారు.