Begin typing your search above and press return to search.

మేలుకోరు చంద్ర‌బాబూ... మేలుకోవ‌య్యా..

By:  Tupaki Desk   |   6 May 2016 5:30 PM GMT
మేలుకోరు చంద్ర‌బాబూ... మేలుకోవ‌య్యా..
X
రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా రైతుల‌కు రుణ‌మాఫీ చేశాం... ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం.. న‌దుల‌ను అనుసంధానించింది మేమే.. ఇలా, ఎక్క‌డికి వెళ్తే అక్క‌డ తాను చేసిన ప‌నుల ఘ‌న‌త‌ను వ‌ల్లెవేస్తున్నారు చంద్రబాబు. మ‌రోవైపు ప్ర‌త్యేక హోదా - విశాఖ రైల్వే జోన్ వంటివి పెండింగ్ లో ప‌డి రాష్ట్ర అభివృద్ధి కంటికి క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు చేసిన ప‌నులు ఎన్ని ఉన్నా చేయ‌లేక‌పోతున్న ప‌నుల‌ను టార్గెట్ చేసి విప‌క్షాలు - చంద్రబాబు వ్య‌తిరేక వ‌ర్గాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

అలాంటి త‌రుణంలో చేసిన ప‌నుల గొప్ప‌లు చెప్పుకోవ‌డం కంటే చేయాల్సిన ప‌నుల‌ను ఎలా చేస్తారో చెప్పాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. ప్ర‌జావ్య‌తిరేక‌త తేవ‌డానికి విప‌క్షాలు పెద్దఎత్తున ప్ర‌య‌త్నిస్తున్న త‌రుణంలో చంద్ర‌బాబు త‌న పంథా మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాజ‌కీయ పండితులు సూచిస్తున్నారు. లేదంటే దెబ్బ‌తిన‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం త‌న కుటిల బుద్ధిని బ‌ట్ట‌బ‌య‌లు చేసుకున్న ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ పంథా మార్చాల‌ని... ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కాన్ని క‌లిగించాల‌ని చెబుతున్నారు. చేసిన ప‌నుల‌ను చెప్ప‌డం కొద్దికాలం మాని..... కేంద్ర మెడ‌లు వంచ‌డానికి ప్ర‌య‌త్నించాల‌ని సూచిస్తున్నారు.

ఏపీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసేసింది. కేంద్రంలోని బీజేపీ కార‌ణంగా చంద్ర‌బాబుకు ఇప్ప‌టికే చాలా న‌ష్టం జరిగిపోయింది. ఇప్ప‌టికైనా మేలుకోక‌పోతే బీజేపీతో పాటు చంద్ర‌బాబు కూడా మునిగిపోయే ప‌రిస్థితి వ‌స్తుంది. ఆల‌స్యం అమృతం విషం అన్న‌ది గ‌తంలో కాంగ్రెస్ తో పాటుగా మునిగిపోయిన నేత‌ల అనుభ‌వాల ద్వారా తెలుసుకోవాలి. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు పోరాడారు. అప్ప‌టి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి - ల‌గ‌డపాటి రాజ‌గోపాల్ వంటివారు త‌మ అధిష్ఠానాన్ని వ్య‌తిరేకించారు. కానీ లాస్ట్ బాల్ కు సిక్సు కొడ‌తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికి చివ‌రి వ‌ర‌కు ప‌ద‌విని అంటుకుని ఉండి కిర‌ణ్ కుమార్ రెడ్డి అటు కాంగ్రెస్ కు - ఇటు ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకిగా మారారు. రాజ‌కీయంగా సోదిలోకి కూడా క‌నిపించ‌కుండా పోయారు. ల‌గ‌డపాటిదీ అదే ప‌రిస్థితి. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా కేంద్రంలోని బీజేపీ విష‌యంలో ఇంకా వేచి చూసే ధోర‌ణే అవలంబిస్తే బీజేపీతో పాటు ఆయ‌నా మునిగిపోయే ప్ర‌మాద‌ముంది.

అయితే, కిర‌ణ్ రెడ్డి - ల‌గ‌డ‌పాటిల‌కు జ‌రిగిన న‌ష్టం కంటే చంద్ర‌బాబుకు జ‌ర‌గ‌బోయే న‌ష్టం ఎక్కువ‌. వారిద్ద‌రూ కేవ‌లం వ్యక్తులు. వారికి క‌లిగిన న‌ష్టం కేవ‌లం వ్య‌క్తిగ‌తం. కానీ, చంద్ర‌బాబు ప‌ట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హిస్తే అది తెలుగు ప్ర‌జ‌ల ద‌శ‌దిశ‌ను మార్చిన తెలుగు దేశం పార్టీకే పెను ప్ర‌మాదం తెస్తుంది. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన‌ట్లుగా టీడీపీ కూడా ప్ర‌జాగ్ర‌హాన్ని చ‌విచూడాల్సి వ‌స్తుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబ‌ట్టి ఒక చోట న‌ష్ట‌పోయినా ఇంకో చోట మ‌న‌గ‌లుగుతుంది. కానీ, టీడీపీ అలా కాదు, తెలుగు ప్ర‌జ‌ల పార్టీ... వారికోసం పుట్టిన పార్టీ. కాబ‌ట్టి టీడీపీ మునిగిపోతే అది తెలుగు ప్ర‌జ‌ల‌కు న‌ష్టం. తెలుగు ప్ర‌జ‌ల‌ను విభ‌జించిన కాంగ్రెస్‌... విభ‌జించిన త‌రువాత సీమాంధ్రులు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మోస‌గించిన బీజేపీ వంటి పార్టీల‌కు ఏపీలో స్పేస్ ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. కాబ‌ట్టి తెలుగు నేల‌కు, తెలుగు ప్ర‌జ‌ల‌ను దెబ్బ‌తీసిన‌వారిని అవ‌కాశ‌మివ్వ‌కూడ‌ద‌న్న ల‌క్ష్యంతోనైనా చంద్ర‌బాబు త‌న పంథా మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు.

ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క్లారిటీ ఇవ్వాల‌ని... మిత్ర‌ప‌క్ష‌మ‌న్న మొహ‌మాటాలు... స్నేహ‌నీతి అన్న సంకోచాలను ప‌క్క‌న‌పెట్టి రాజ‌నీతి చూపించాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు. కాటేయ‌క‌పోయినా క‌నీసం బుస కొట్టాల‌ని చెబుతున్నారు. అలాకాన‌ప్పుడు కాంగ్రెస్ - బీజేపీల‌తో పాటు విప‌క్షాలు ఆరోపిస్తున్న‌ట్లుగా సీమాంధ్ర ద్రోహి అన్న మ‌చ్చ చంద్ర‌బాబుకు కూడా వ‌చ్చేస్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వెలుగుచూపిన నేత‌గా చ‌రిత్ర‌కెక్కాల‌ని తపిస్తున్న చంద్ర‌బాబుకు రుణ‌మాఫీ - నదుల అనుసంధానం.. కానుక‌లు - పింఛ‌న్లు వంటి సాధార‌ణ క్రెడిట్లే త‌ప్ప ప్ర‌త్యేక హోదా సాధ‌న వంటి చారిత్ర‌క భుజ‌కీర్తులు రావ‌ని భ‌విష్య‌త్ చిత్రాన్ని చూపిస్తున్నారు. కాబ‌ట్టి మేలుకో చంద్ర‌బాబూ... మేలుకో. మేలుకొని నీ ప్ర‌జ‌ల మేలుకోరుకో.