Begin typing your search above and press return to search.

కష్టపడి పని చేయటమే తప్పా అంటున్న బాబు

By:  Tupaki Desk   |   2 May 2016 4:26 PM GMT
కష్టపడి పని చేయటమే తప్పా అంటున్న బాబు
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన పలు అంశాల గురించి వివరాలు అందించే ప్రయత్నం చేశారు. అయితే.. మీడియా దృష్టి మొత్తం ప్రత్యేక హోదా అంశం మీదనే ఉండటం.. అందుకు సంబంధించిన వివరాల మీదనే ఆసక్తి ప్రదర్శించింది. ప్రధాని మోడీ మీద తనకున్న అసంతృప్తిని చాలా బ్యాలెన్స్ గా మొయింటైన్ చేస్తూ.. ఎక్కడా తొందరపాటుకు.. త్రోటుపాటుకు గురి కాకుండా ఆచితూచి వ్యవహరించిన చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదాను ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ తో పాటు.. ఈ విషయంపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఏపీ అభివృద్ధి చెందుతుందంటున్న కేంద్రం మాటలపై చంద్రబాబు తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఎర్రటి ఎండలో తిరుగుతూ.. నిత్యం కష్టపడి పని చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా చేస్తుంటే.. సాయం చేయటం వదిలేసి.. అభివృద్ధి చెందుతుంది కదా అంటూ వ్యాఖ్యలు చేయటం సరికాదన్న మాటను చెప్పే ప్రయత్నం చేశారు. ఒకదశలో.. తనలో ఉన్న అసంతృప్తిని బయటపెడుతూ.. అంటే.. కష్టపడి పని చేయటమే తఫ్పా? అని ప్రశ్నించారు.

విభజన చట్టంలోని చాలా సమస్యలు పరిష్కారం కాలేదన్న విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా.. రైల్వే జోన్ అంశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా వృద్ధి చెందటానికి సాయం చేయాలన్న చంద్రబాబు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్న మాటను చెప్పుకొచ్చారు. కేంద్రం తీరు మీదా.. ప్రధాని వైఖరి మీద.. పీఎంవో అధికారుల తీరు మీద లోలోపల మంట మండుతున్నా.. తనది కాని సమయంలో తొందరపడి మాట్లాడకూడదన్న వైఖరి చంద్రబాబు ప్రతి మాటలోనూ స్పష్టంగా కనిపించింది.