Begin typing your search above and press return to search.

అవకాశవాద పొత్తుల్లో ఆరుతున్న టీడీపీ దీపం

By:  Tupaki Desk   |   18 Nov 2018 4:02 PM GMT
అవకాశవాద పొత్తుల్లో ఆరుతున్న టీడీపీ దీపం
X
కార్తీక మాసం ఆరంభమైంది.. చుట్టాలు - పక్కాలు - దూర బంధువులు - కుటుంబ సభ్యులు ఇలా అల్లుకున్న బంధాలు, పెనవేసుకున్న అనుబంధాలు - కలుపుతున్న అనురాగాలతో వన సమారాధనలు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన అన్ని పార్టీలు.. ఆ పార్టీలలోని నాయకులతో కలిసి వన భోజనాలు కడుపు నిండా ఆరగిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఎవరితో కలిసి వన సమారాధనలు అంటూ జట్టు కట్టాలో - ఎవరిని దూరంగా పెట్టాలో - ఏయే పాత మిత్రులతో జ్ఞాపకాలు పంచుకోవాలో అర్థంగా ఆ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

ఏడాది క్రితం వరకు భారతీయ జనతా పార్టీనే దేశానికి మార్గదర్శి అంటూ తన భుజాలపై ఎక్కించుకుని మోశారు చంద్రబాబు. ఆయన తెచ్చిన మట్టి - నీళ్లను మహా ప్రసాదంగా స్వీకరించి.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి ఐసీయూలో పడేస్తే.. మోదీ ఆయువు పోస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పై ఈగ వాలకుండా కాపాడుకుంటూ వచ్చారు. ఒక దశలో ఉద్దానం బాధితుల విషయంలో అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షమైన వైఎస్సార్‌ సీపీపై పవర్‌ స్టార్‌ తో విమర్శలు గుప్పించేలా చేశారు. ఇలా నాలుగేళ్లపాటు పాత మిత్రులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఆ పార్టీల నేతలకు చంద్రబాబు అసలు నైజం తెలిసే సరికి దూరంగా జరిగారు. అంతే బీజేపీ దేశానికి పట్టిన శనిగా, పవన్‌ కల్యాణ్‌ పరిణితిలేని నేతగా చంద్రబాబు అభివర్ణిస్తున్నారు. అప్పట్లో ఒకే మాట.. ఒకే కంచంగా మెలిగిన ఈ పాత మిత్రులు.. ఇప్పుడు కలిసి భోజనాలు కూడా చేయడానికి ఇష్టపడక ముఖం చాటేసుకుంటున్నారు.

ముద్ద దిగడం లేదు

కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేక పునాదులపై ఉద్భవించిన తెలుగుదేశం పార్టీ.. వారితో కలిసి ఏనాడూ రండి రండి.. వన భోజనాలకు రండి అంటూ ఆహ్వానించింది లేదు.. 30 ఏళ్లకుపైగా కాంగ్రెస్ - టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు కళ్లతోనే నిప్పులు కురిపించుకున్నారు. కడుపులో కక్షల కత్తులు పెట్టుకుని వాటికి మాటల పదును పెట్టి బహిరంగంగానే ఒకరిపై ఒకరిపై ఎక్కు పెట్టుకున్నారు. ఇలా సాగిన ఆ రెండు పార్టీల ప్రయాణం.. నేడు అధికారమే పరమావధిగా ఒకే గొడుగు కిందకు వచ్చి చేరాయి. వీరితో కలసి మెలసి కడుపారా వన భోజనాలు ఆరగించాలని చంద్రబాబు ఎంతో ప్రేమతో చెబుతున్నా.. ఆ పార్టీ నాయకులకు ముద్ద దిగడం లేదు. కంచంలో ప్రతి మెతుకూ ఇది అనైతిక పొత్తేనంటూ నోటి దాకా వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరితో కలిసి కార్తీక దీపాన్ని వెలిగించాలో అర్థంగాక తెలుగు దేశం పార్టీ నేతలు మౌనంగా తమలో తామే మధన పడుతున్నారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులపై ఐటీ సోదాలు ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు.. జాతీయ రాజకీయాలపై మొగ్గు చూపారు. బీజేపీకి వ్యతిరేక కూటమి కడుతున్నామనే నెపంతో తన ఆత్మరక్షణ కోసం అన్ని పార్టీల నాయకుల వద్దకు వెళ్లి దోస్త్‌మేరా దోస్త్‌ అంటూ స్నేహ హస్తం చాపుతున్నారు. ఆయా రాష్ట్రాల నేతలు బీజేపీకి వ్యతిరేకం కావడంతో చంద్రబాబుతో మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు. ఇదే అదనుగా తానే కూటమిని నడిపిస్తున్నానని చంద్రబాబు బాకా ఊదేస్తున్నారు. తమ వద్దకు వచ్చి సాయం కోరిన బాబు.. తానే ముందుండి నడిపిస్తున్నానని బిల్డప్‌ ఇస్తుండడంతో ఆయా రాష్ట్రాలలోని నేతలకు చిర్రెత్తికొస్తోంది. ఈ నేపథ్యంలో కార్తీక సమారాధనకు రారండి అని చంద్రబాబు పిలిచినా వారు ముఖం చాటేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవిత్ర కార్తీక మాసం వేళ తెలుగుదేశం పార్టీ ఆశల దీపానికి అండగా చమురు పోసేవారులేక..మీరూ మేము ఆత్మీయులమంటూ కలిసి వన భోజనాలు చేసే వారు కానరాక ఆ పార్టీ నేతలు కుమిలిపోతున్నారు. అవకాశవాద రాజకీయాలతో వత్తులు వెలిగించి పరమేశ్వరా ఇదిగో హారతి అంటూ రెండు చేతులు జోడిస్తే.. చివరకు అంతిమ ఫలితం ఓటమి తీరమేనని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు.