కాంగ్రెస్ తో కలుస్తారా అంటే బాబు ఏమన్నారంటే..

Wed May 23 2018 18:52:40 GMT+0530 (IST)

మీడియా వేసే క్లిష్ట ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబుకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో... పలాయనవాదంలో సిద్దహస్తుడని నిత్యం విమర్శకులతో తిట్టించుకునే చంద్రబాబు మీడియా ఇబ్బందిపెట్టే ప్రశ్నలు వేస్తే అటుతిప్పి ఇటుతిప్పి ఆన్సర్ చెప్పకుండా తప్పించుకుంటూ ఉంటారు. తాజాగా కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమ సందర్భంగా ఆయన ఇలాగే చేశారు. కాంగ్రెస్ తో పనిచేయడానికి మీరు సిద్ధమేనా అని అడిగిన మీడియా ప్రతినిధులకు ఆయన సరైన సమాధానం ఇస్తేనే కదా..
    
బుధవారం సాయంత్రం జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరయ్యారు. కాంగ్రెస్ తో జట్టుకట్టి కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పరచడంతో రాహుల్ సహా కాంగ్రెస్ పెద్దతలకాయలన్నీ అక్కడికొచ్చాయి. ఈ సందర్భంగా చంద్రబాబు - రాహుల్ చేయీచేయీ కలిపారు. ఇంకేముంది మీడియాకు అది హాట్ న్యూస్ అయింది.
    
దీంతో ఓ విలేకరి బాబును కాంగ్రెస్ తో మీరు కలిసి పనిచేస్తారా అని ప్రశ్నించారు. దీనికి బాబు నేరుగా సమాధానమివ్వకుండా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తానన్నారు. కాంగ్రెస్ గురించి ఒక్క మాట చెప్పకుండా ఏదేదో చెప్పారు. అయితే.. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ కాంగ్రెస్ మద్దతులో జేడీఎస్ ఏర్పరిచిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు మాత్రం చెప్పారు. దీంతో మునుపటి మాదిరిగా బాబు కాంగ్రెస్ ను తన ప్రధాన శత్రువుగా చూడడం లేదని అర్థమవుతోంది.