Begin typing your search above and press return to search.

తొండాట‌కు వ్యూహం సిద్ధం చేస్తున్న బాబు?

By:  Tupaki Desk   |   24 Feb 2018 6:04 AM GMT
తొండాట‌కు వ్యూహం సిద్ధం చేస్తున్న బాబు?
X
చిన్న‌పిల్లాడికి ఉన్న బుద్ధి సైతం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు లేద‌న్న విమ‌ర్శ ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు చేస్తుంటారు. త‌న‌ది కాని దానిపై బాబుకు ఉండే ఆశ అంతాఇంతా కాద‌ని చెబుతారు. ఈ క‌క్కుర్తే ఆయ‌నకు లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెట్టింద‌ని చెబుతారు. తెలంగాణ రాష్ట్రంలో త‌న బ‌లాన్ని ఫ్రూవ్ చేసుకునేందుకు.. తెలంగాణ అధికార‌ప‌క్షంపై త‌న అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించేందుకు ప‌డిన క‌క్కుర్తి.. ఓటుకు నోటు సీన్ కు కార‌ణంగా చెబుతారు.

నోట్ల క‌ట్ట‌ల‌తో రాజకీయం చేసి అడ్డంగా దొరికిపోయిన నాటి టీటీడీపీ నేత రేవంత్ దెబ్బ‌కు బాబు ఇమేజ్ ఎంత‌గా డ్యామేజ్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

వాస్త‌వానికి ఏదైనా ఎదురుదెబ్బ త‌గిలిన వెంట‌నే ఆచితూచి అడుగులు వేయ‌టం క‌నిపిస్తుంది. కానీ.. బాబులో అది మిస్ అవుతుంద‌ని చెబుతారు. చిన్నపిల్లాడు సైతం ఏదైనా ఎదురుదెబ్బ త‌గిలిన వెంట‌నే.. ఆ ప‌ని చేయ‌టం మానేస్తాడు. కానీ.. బాబు మాత్రం త‌ప్పు మీద త‌ప్పు చేస్తూనే ఉంటాడ‌ని చెబుతారు. ఓటుకు నోటు లాంటి భారీ ఎదురుదెబ్బ త‌ర్వాత కూడా బాబు త‌న తీరును మార్చుకోలేదంటున్నారు. ఇందుకు తాజా రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు.

తాజాగా విడుద‌లైన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్రకారం ఏపీలో మూడు.. తెలంగాణ‌లో మూడు స్థానాలకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నామ‌మాత్రంగా మారిపోయిన నేప‌థ్యంలో బాబు అక్క‌డ చేసేదేమీ లేదు. ఇక‌.. తాను ప‌వ‌ర్ లో ఉన్న మూడు స్థానాలకు సంబంధించి చూస్తే.. రెండు స్థానాల్ని గెలుచుకునే బ‌లం మాత్ర‌మే బాబుకు ఉంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఒక అభ్య‌ర్థి ఓట్ల లెక్కింపు మొద‌టి రౌండ్లోనే గెల‌వాలంటే 45 ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ఏపీలో ప్ర‌స్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే.. ఒక సీటు గెలుచుకోవ‌టానికి అవ‌స‌ర‌మైన సంఖ్యా బ‌లం ప‌క్కాగా ఉన్న‌ట్లు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకు ఇద్ద‌రు ఎంపీల్ని గెలిపించుకునే వెసులుబాటు ఉంది.

త‌న‌కు ద‌క్కేది తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్యా ఉండ‌దు. కానీ.. బాబుకు త‌న‌కు కాని దాని మీద కూడా ఆశ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న పేరుంది. ఇందుకు తగ్గ‌ట్లే ఏపీలో జ‌రిగే రాజ్య‌స‌భ మూడుస్థానాల‌కు అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దింపాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ఆ పార్టీ నేత‌లు సైతం ఇదే మాట‌ను చెబుతున్నారు. బ‌లం లేని బాబు మూడు స్థానాల‌కు ఎలా పోటీ చేస్తారంటే.. ఇక్క‌డే ఉండి బాబు క‌క్కుర్తి అంతా.

జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేల్లో జంప్ జిలానీల్ని ప్రోత్స‌హించి త‌న పార్టీలోకి తీసుకొచ్చిన ఆయ‌న‌.. మ‌రో ఇద్ద‌రు.. ముగ్గురు జంప్ జిలానీల్ని ప్రోత్స‌హించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇలా చేయ‌టం ద్వారా విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధ‌ర్మంగా రావాల్సిన రాజ్య‌స‌భ సీటును త‌మ సొంతం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిత్యం నీతులు వ‌ల్లించే చంద్ర‌బాబు.. ఎన్నిక‌ల్లో అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించే విష‌యంలో మాత్రం వెనుకా ముందు ఆడ‌రు. అదేమంటే.. అదే రాజకీయం అంటారు. ఇలాంటి రాజ‌కీయంతోనే ఓటుకు నోటు ఎపిసోడ్ తెర మీద‌కు వ‌చ్చేలా చేసి ప‌రువు పోగొట్టుకున్నాక కూడా.. ఇప్ప‌టికి త‌న క‌క్కుర్తి రాజ‌కీయాలకు పుల్ స్టాప్ పెట్ట‌లేద‌న్న మాట వినిపిస్తోంది. తాజా రాజ్య‌స‌భ ఎన్నిక మ‌రోసారి ఆ విష‌యాన్ని రుజువు చేయ‌టం ఖాయ‌మంటున్నారు.