Begin typing your search above and press return to search.

బాబు తలచుకుంటే అంతే!

By:  Tupaki Desk   |   23 Feb 2018 4:28 AM GMT
బాబు తలచుకుంటే అంతే!
X
ఒకవైపు పోలవరం ఇదిగో పూర్తయిపోతోంది.. అదిగో పూర్తయిపోతోంది.. అంటూ చంద్రబాబునాయుడు ప్రతి సోమవారమూ ఊదరగొట్టేస్తూ ఉంటారు. కానీ అచ్చంగా ఏడాది ఆలస్యం కాబోతున్నట్లుగా తాజాగా ఇంజినీర్ల అంచనాలు చెబుతున్నాయి. ఇవి ప్రస్తుత అంచనాలు మాత్రమే వారు అనుకుంటున్నట్లుగా 2019 ఏడాది చివరి నాటికంటె ఎక్కవ ఆలస్యం జరిగినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ పనుల వ్యవహారంలో.. నవయుగ కన్ స్ట్రక్షన్ కంపెనీ వారికి కొత్తగా స్పిల్ వే - స్పిల్ చానెల్ పనులను అప్పగించిన సంగతి తెలిసిందే. ఒకవైపు వారు పనులకు టెంకాయ కూడా కొట్టేశారు. అయితే తాజాగా ఇంజినీర్ల నివేదికలను గమనిస్తే.. ఇప్పటిదాకా పాత కాంట్రాక్టరునుంచి పనులను వేరుచేసి.. నవయుగ వారికి సాంకేతికంగా అప్పజెప్పలేదు. అప్పుడే వారికి నిధులు అందజేయడానికి మాత్రం కేబినెట్ పరిపాలన పరమైన అనుమతిని కూడా ఇచ్చేసింది.

బాబు తలచుకుంటే.. అంతే ఇంకా పనులను పూర్తిగా అప్పగించకపోయినా - పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోయినా.. నిధుల మంజూరుకు సంబంధించిన అనుమతులు అన్నీ హుటాహుటిన జరిగిపోతాయని అంతా అనుకుంటున్నారు. నవయుగ కంపెనీ వారు పాత టెండరు ఒప్పంద ధరలకే కాంట్రాక్టు పనిచేయడానికి ముందుకొచ్చిన మాట నిజమే.

తొలుత చంద్రబాబునాయుడు కొత్త టెండర్ల పేరుతో 1500 కోట్ల అదనపు భారం మోపడానికి రంగం సిద్ధం చేస్తే కేంద్రం అందుకు అడ్డు పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరూపాయి కూడా ఖర్చు పెరగడానికి వీల్లేదని నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. అయినా సరే ఆ భారాన్ని రాష్ట్ర ఖజానా మీద మోపేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్న తరుణంలో నవయుగ కంపెనీ తెరమీదకు వచ్చింది.

కానీ వారికి పనులు అప్పగించడంలో ఉన్న కొన్ని సాంకేతిక ఇబ్బందులను ప్రభుత్వం సత్వరం తొలగించాల్సి ఉంది. పాత కాంట్రాక్టరునుంచి టెక్నికల్ గా కూడా పనులను వేరుచేసి.. వీరికివ్వాలి. పాత కాంట్రాక్టరు న్యాయపరంగా ప్రొసీడ్ కాకుండా.. దానివల్ల పనులు ఆగేలా చికాకు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తన కేబినెట్ నిర్ణయంతో తన చేతిలో ఉన్న పని కదాని.. నిధుల విడుదలలో మాత్రం స్పీడు పెంచేసి.. పనుల నడకలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. మళ్లీ ముందు ముందు ఇబ్బందులు తప్పవని పలువురు భావిస్తున్నారు.