ఈ `దుబారా`దీక్షలే చంద్రబాబుకు శ్రీరామరక్ష!

Mon Jun 04 2018 20:00:01 GMT+0530 (IST)

కొంతకాలంగా ఏపీలో దీక్షల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రకరకాల దీక్షల పేరుతో ప్రజలను ఆకట్టుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ధర్మపోరాట దీక్ష...నవ నిర్మాణ దీక్ష....ఇలా పేర్లేవైతేనేం....దీక్ష చేయడం కామన్. తాజాగా అదే తరహాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డ జూన్ 2ను పురస్కరించుకొని చంద్రబాబు `నవ నిర్మాణ దీక్షల`లను చేపట్టారు. ఈ దీక్షలకు బాబుగారు ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేశారు. ఇంకా అవసరమైతే మరో 50లక్షలు కూడా ఇస్తానని వెల్లడించారు. అయితేకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్భాటంగా చేస్తోన్న ఈ దీక్షల వల్ల అసలు ఉపయోగమేంటి? ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా ఉంది కదా? అన్న ప్రశ్నలు కామన్ సెన్స్ ఉన్న ప్రతి కామన్ మ్యాన్ కు ఉత్పన్నమవుతాయి.ఇపుడు రాష్ట్రంలో ఏ మండలంలో చూసినా నవ నిర్మాణ దీక్ష సందడి కనిపిస్తోంది. ఆ దీక్షలో పాల్గొనాలని ప్రభుత్వోద్యోగులు - అధికారులను  చంద్రబాబు హుకుం జారీ చేశారు. దీక్షా స్థలికి జన కళ తెప్పించేందుకు ఆశా వర్కర్లు - అంగన్ వాడీ కార్యకర్తలు - డ్వాక్రా మహిళలను తరలిస్తున్నారు. ఇన్ని చేసినా...ఆ దీక్షా స్థలాలు జనకళ లేక వెలవెలబోతున్నాయి. మండుటెండలలో మధ్యాహ్నం 2 నుంచి ఆ దీక్షలను నిర్వహించి ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప చంద్రబాబు సాధించేదేమీ లేదు. పోనీ ఇంత కష్టపడి ఆ దీక్షలో పాల్గొంటే.....ఉపయోగం ఏమీ ఉండదు. మినీ మహానాడును తలపించే ఆ దీక్షలో....జనసేన - వైసీపీలపై టీడీపీ నేతలు వీర లెవల్ లో విమర్శలు గుప్పిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని - ప్రధాని మోదీని - రాష్ట్ర బీజేపీని - ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ ను - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వారం రోజుల పాటు విమర్శించడమే ఆ దీక్షల ఎజెండా.

సాధారణంగా ఏదైనా ఒక ఉద్దేశ్యంతో - లక్ష్యంతో నిరాహర దీక్ష - మౌన దీక్ష వంటివి చేస్తుంటారు. ఆ లక్ష్యం నెరవేరగానే లేదంటే...నెరవేరుతుందనే హామీ రాగానే ఆ దీక్షను విరమిస్తారు. అయితే చంద్రబాబు చేపట్టిన దీక్షలు చరిత్రలో నిలిచిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక దశా దిశా లేకుండా అసలెందుకు చేస్తున్నామో తెలీకుండానే కోట్లు ఖర్చు పెట్టి దీక్షలు చేసిన సీఎం చంద్రబాబేననడంలో అతిశయోక్తి లేదు.

జన్మ భూమి కమిటీలు - టెలీకాన్ఫరెన్స్ ల పేరిటి చంద్రబాబు అధికారుల సమయాన్ని వృథా చేస్తున్నారని మొన్న మహానాడులో జేసీ చెప్పిన సంగతి తెలిసిందే. నవనిర్మాణ దీక్ష కారణంగా అదే తరహాలో పరిపాలన కుంటుపడుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. అధికారులంతా దీక్షల్లో హాజరు వేయించుకోవడం కోసం తమ రోజువారీ కార్యకలాపాలను పక్కనబెట్టడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అటకెక్కాయి. రు ప్రతిరోజు దీక్ష జరిగిన తీరుపై నివేదికలు ఇవ్వడం కోసం 17వేల మంది నోడల్ అధికారులను నియమిండం బాబు పైత్యానికి పరాకాష్ట! భవిష్యత్తులో ఈ దీక్షలే తనక శ్రీరామ రక్ష అవుతాయన్న ఉద్దేశ్యంతోనే బాబు వీటికోసం కోట్లు కుమ్మరిస్తున్నారనడంలో సందేహం లేదు.