కడపలో పరువు కోసం టీడీపీ కొత్త స్కెచ్

Tue Jun 12 2018 20:39:18 GMT+0530 (IST)


ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్న అధికార తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఇందుకోసం అన్ని దారులను అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే  సొంత జిల్లా అయిన కడపలోనే టీడీపీ స్వీప్ చేయించడమే కాకుండా.. పులివెందుల నియోజకవర్గంలోనే వైసీపీ ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలకు టార్గెట్ ఇచ్చారు. సమావేశం - సందర్భం ఏదైనా ఆయన ఇదే సందేశాన్ని ఇస్తున్నారు.! అయితే ఇది కాస్త బూమరాంగ్ అయిన సంగతి తెలిసిందే. కడపలో జంప్ జిలానీ మంత్రి ఆదినారాయరెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వివాదం తారాస్థాయికి చేరుకుంది. దీనికి తోడుగా టీడీపీ సీనియర్ నేత - పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడనే పేరున్న ఎంపీ సీఎం రమేష్ పై మాజీ ఎమ్మెల్యే - ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ వరదరాజులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీకి ఎక్కువ...! మండలానికి తక్కువ అయిన సీఎం రమేష్... పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దయతో రాజ్యసభకు ఎన్నికయ్యారంటూ విమర్శించారు. ఈ పరిణామం అధికార టీడీపీలో కలకలానికి దారితీసింది.చంద్రబాబు సన్నిహితుడనే పేరున్న నాయకుడైన పార్టీ సీనియర్ నేత - ఎంపీపై టీడీపీ నాయకుడైన వరదరాజులు రెడ్డి విరుచుకుపడటం సంచలనంగా మారింది. పైగా చంద్రబాబు నిర్ణయాన్నే దిక్కరించేలా సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారనే సందేశాన్ని కూడా పంపించింది. ఈ కామెంట్లు పార్టీ పరువును గంగపాలు చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు దిగారు. కడప జిల్లా టీడీపీ నేతలలో వచ్చిన బేదాభిప్రాయాల నేపథ్యంలో కడప జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు - ఎంపీ సీఎం రమేశ్ - ఆదినారాయణ రెడ్డి - కడప జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కడప జిల్లాలో పార్టీ పరిస్థితి నేతల మధ్య విభేదాలు వంటి పలు అంశాలపై చంద్రబాబు నాయుడు సమావేశంలో మాట్లాడారు. అనంతరం కడప జిల్లా నేతలు మీడియాతో సమావేశమయ్యి తమలో బేదాభిప్రాయాలు లేవనీ చంద్రబాబుకు చెప్పారు.

ఈ సందర్భంగా కీలక చర్చ జరిగినట్లు సమాచారం. జిల్లాలో టీడీపీ నేతలు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ పలు కారణాలతో బేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయన్నారు. పార్టీ కోసం పనిచేస్తామని కడప జిల్లా నేతలు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పరువు పోవద్దని ఆదేశించిన చంద్రబాబు..పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఎంపీ సీఎం రమేష్ తాను ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రతిపాదించినట్లు సమాచారం. విభజన హామీగా ఉన్న ఫ్యాక్టరీని కోసం పోరాటం చేయడం వల్ల పార్టీకి మద్దతు పెరుగుతుందని ఆయన పేర్కొనట్లు తెలుస్తోంది.