జగన్ యాత్రతో బాబుకు బీపీ పెరిగిపోతోందా?

Tue Dec 12 2017 21:00:02 GMT+0530 (IST)

వైసీసీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర... ఏపీలో అధికార పార్టీ టీడీపీ అధినేత - సీఎం నారా చంద్రబాబునాయుడును ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? 6 నెలల పాటు కొనసాగే జగన్ యాత్ర ఇప్పటికి కేవలం ఓ నెలే పూర్తి అయ్యింది. ఈ తక్కువ కాలంలో కేవలం రెండు జిల్లాల్లో పూర్తి అయిన ఈ యాత్ర రెండో నెలలో కొనసాగుతోంది. ఈ మాత్రానికే చంద్రబాబులో బీపీ హై రేంజికి చేరిపోతే... ఇక మొత్తం 6 నెలల పాటు 13 జిల్లాల్లో జగన్ యాత్ర పూర్తి అయితే బాబు బీపీ ఏ రేంజికి చేరుతుందోనన్న వాదన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయిందనే చెప్పాలి. అయినా జగన్ యాత్రతో చంద్రబాబు అంతగా ఇదైపోవాల్సిన అవసరం ఉందా? అంటే... సాధారణంగా అయితే లేదు గానీ... 2019 ఎన్నికలు సమీపిస్తుండటం ఆ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్ ఈ యాత్రను చేపట్టడం - ఎక్కడికక్కడ చంద్రబాబు సర్కారు సాగిస్తున్న పాలనపై జగన్ నిప్పులు చెరుగుతుండటంతోనే బాబులో బీపీ పెరిగిపోతోందని చెప్పాలి. జగన్ యాత్రతో బాబులో బీపీ నానాటికీ పెరిగిపోతున్న వైనాన్ని కాస్తంత నిశితంగా పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు మనకు కనిపించక మానవు.గడచిన ఎన్నికల విషయాన్నే తీసుకుంటే... నాడు గెలుపు తనదేనన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో జగన్ బయలుదేరితే... ఎలాగైనా జగన్ కు అధికారం దక్కకుండా చేయాలన్న సింగిల్ ఉద్దేశంతోనే బాబు వ్యూహాలు రచించారు. తనకు అధికారం దక్కదన్న భావన కూడా నాడు చంద్రబాబులో కనిపించిన మాట వాస్తవమేనని చెప్పాలి. ఎందుకంటే... నాడు వెలువడిన సర్వేలన్నీ కూడా జగన్ వైపే మొగ్గు చూపాయి. టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే ఏకంగా జగనే ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని కూడా జోస్యం చెప్పారు. అయితే ఊహించని పరిస్థితుల నేపథ్యంలో జగన్‌కు అధికారం వెంట్రుకవాసిలో అందకుండా పోగా... అసలు ఏమాత్రం ఆశలు లేని చంద్రబాబుకు అధికార దండం చేతికందిపోయింది. ఇందుకు కారణాలను విశ్లేషించగా... నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు అమలు కాని హామీలను ఇబ్బడిముబ్బడిగా గుప్పించడంతో పాటు చివరి నిమిషంలో జనసేన అధినేతగా రంగంలోకి దిగిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్... టీడీపీ-బీజేపీ కూటమికి అనుకూలంగా ప్రచారం చేయడం కూడా ఓ కారణమని చెప్పాలి.

చంద్రబాబులా తాను అమలు సాధ్యం కాని హామీలను ఇవ్వలేనన్న ఒకే ఒక్క కారణంతో చేతికందిన అధికారాన్ని జగన్ వదిలేసుకున్నారన్న విశ్లేషణలు కూడా సాగాయి. ఇక ప్రస్తుత విషయానికి వస్తే... జగన్ పాదయాత్రలో చాలా ఉత్సాహంగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న జగన్‌లో మరింత రాజకీయ పరిణతి వచ్చిందని చెప్పక తప్పదు. ఏ అంశంపై అయినా చాలా విస్పష్ట అవగాహనతో ముందుకు సాగుతున్న జగన్.. తాను అధికారంలోకి వస్తే... ఏం చేస్తానన్న విషయాన్ని ఆయన ప్రజలకు చాలా స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు గడచిన ఎన్నికల్లో ఏఏ హామీలు ఇచ్చారు?  వాటిలో ఎన్ని అమలు అవుతున్నాయి? ఏదేనీ సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు సర్కారు ఎలా వ్యవహరిస్తోంది? సదరు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఈ దిశగా ముందుకు సాగి ఉంటే బాగుండేది కదా? ఆ సమస్య చాలా ఈజీగానే పరిష్కారమయ్యేది కదా?  రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టు పెట్టడానికి గల కారణాలు?  బాబు కేబినెట్ మంత్రులు - టీడీపీ ఎమ్మెల్యేలు సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలు - అవినీతి వ్యవహారాలను జనం ముందుచూపి జగన్ చాలా వాడీ వేడీ ప్రసంగాలు చేస్తున్నారు.  

ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగానే సమయముండగానే... జగన్ ఈ తరహా దూకుడు ప్రదర్శిస్తే... ఇక ఎన్నికలు మరింత సమీపిస్తే ఆయన దాడి ఎలా ఉంటుందోనన్న భయం ఇప్పుడు టీడీపీ నేతలను ప్రత్యేకించి చంద్రబాబును తీవ్ర అయోమయానికే గురి చేస్తోందట. ఈ కారణంగా జగన్ యాత్రపై నిత్యం ఎవరో ఒకరు ఎదురు దాడి చేసేలా చంద్రబాబు పక్కా ప్లాన్ ను రచించినట్లు గానూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే జగన్ యాత్ర కేవలం రెండు జిల్లాల్లో పూర్తి అయ్యి... మూడో జిల్లాలోకి ప్రవేశించగానే చంద్రబాబులో ఇంతగా కలవరపాటు కనిపిస్తుంటే... 13 జిల్లాల్లో ఈ యాత్ర పూర్తయ్యే నాటికి చంద్రబాబు పరిస్థితి ఏమిటన్న అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగానే చర్చ సాగుతోంది.