Begin typing your search above and press return to search.

కేటీఆర్ ప‌ట్టాభిషేకంతో బాబుపై పెరుగుతున్న ఒత్తిడి!

By:  Tupaki Desk   |   15 Dec 2018 8:47 AM GMT
కేటీఆర్ ప‌ట్టాభిషేకంతో బాబుపై పెరుగుతున్న ఒత్తిడి!
X
టీఆర్ ఎస్‌ లో ఓ కీల‌క ఘ‌ట్టం పూర్త‌యింది. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ త‌మ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కుమారుడు కేటీఆర్ ను నియ‌మించారు. దీంతో పార్టీ ప‌గ్గాలు దాదాపుగా కేటీఆర్ చేతిలోకి వెళ్లిన‌ట్లే. ఇక కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై - సీఎం విధుల నిర్వ‌హ‌ణ‌పై త‌న దృష్టిని పూర్తిగా కేంద్రీక‌రించ‌నున్నారు.

తెలంగాణ సంగ‌తి స‌రే. మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంగ‌తేంటి? అదేంటి.. ఏపీకి కేటీఆర్ ప‌ట్టాభిషేకానికి లింకేంటి అంటారా? అదేనండి.. తెలంగాన‌లో టీఆర్ ఎస్ లాగే ఏపీలో టీడీపీ ఉందిగా. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ముఖ్య‌మంత్రి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఏపీ ముఖ్య‌మంత్రి. అక్క‌డ కేసీఆర్ త‌న‌యుడు మంత్రిగా ప‌నిచేస్తుంటే.. ఇక్క‌డ బాబు కుమారుడు లోకేష్ కూడా మంత్రిగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇద్ద‌రూ పార్టీలో కీల‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రి కేటీఆర్ ప‌ట్టాభిషేకం పూర్త‌యిన నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రి మ‌దిలోనూ మెదులుతున్న ప్ర‌శ్న‌.. లోకేష్ ప‌ట్టాభిషేకం ఎప్పుడు?

కేసీఆర్ లాగే చంద్ర‌బాబు కూడా జాతీయ రాజ‌కీయాల్లో చక్రం తిప్పాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ - కాంగ్రెస్ జోక్యం లేని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. బీజేపీని ఎలాగైనా గ‌ద్దె దింపాల‌న్న ల‌క్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలోని కూట‌మికి చంద్ర‌బాబు మ‌ద్ద‌తిస్తున్నారు. ప‌దే ప‌దే దేశ రాజ‌ధానిలో ప‌ర్య‌టిస్తూ కూట‌మి ఏర్పాటు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ త‌ర‌హాలోనే జాతీయ రాజ‌కీయాల‌పై పూర్తిగా దృష్టి కేంద్రీక‌రించేందుకు వీలుగా చంద్ర‌బాబు కూడా త‌న త‌న‌యుడు లోకేష్ కు త్వ‌ర‌లోనే పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా లోకేష్ మ‌ద్ద‌తుదారులైన కొంద‌రు నేత‌లు చంద్ర‌బాబు వ‌ద్ద ఈ విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇష్టం ఉన్నా లేకున్నా చంద్ర‌బాబు ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిన వారు క‌ల్పిస్తున్న‌ట్లు స‌మాచారం.

నిజానికి కేటీఆర్ - లోకేష్ ల ప‌రిస్థితి పూర్తిగా భిన్న‌మైన‌ది. కేటీఆర్ త‌న తండ్రి బాట‌లో తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో పాల్గొన్నారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. మంత్రిగానూ ప‌నిచేశారు. పార్టీపై ప‌ట్టు సాధించారు. త‌న‌ను తాను నిరూపించుకున్నారు. ఆయ‌న ప్ర‌సంగం అన‌ర్గ‌ళంగా ఉంటుంది. అందుకే ఆయ‌న‌కు పార్టీలో ప్ర‌మోష‌న్ ఇచ్చేందుకు కేసీఆర్ ఏమాత్రం త‌ట‌ప‌టాయించ‌లేదు.

లోకేష్ ప‌రిస్థితి అది కాదు. ఆయ‌న ఎలాంటి పోరాటాల్లో పాల్గొన‌లేదు. కేవ‌లం చంద్ర‌బాబు వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఎప్పుడూ నిల‌వ‌లేదు. పార్టీ అండ‌తో ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి ప‌ద‌వి స్వీక‌రించారు. తెలంగాణ‌లో కేటీఆర్ తీసుకున్న శాఖ‌ల‌నే ప‌ట్టుప‌ట్టి ఏపీలో తాను తీసుకున్నారు. ఇక లోకేష్ ప్ర‌సంగం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌లుమార్లు నోరుజారి ఆయ‌న విమ‌ర్శ‌ల పాల‌య్యారు.

ఈ ప‌రిస్థితుల్లో కేటీఆర్ కు కేసీఆర్ ప్ర‌మోష‌న్ ఇచ్చినంత మాత్రాన అది చూసి చంద్ర‌బాబు కూడా లోకేష్‌ కు మెరుగైన ప‌ద‌వులుగానీ బాధ్య‌త‌లుగానీ క‌ట్ట‌బెడితే అది పులిని చూసి న‌క్క వాత పెట్టుకున్న‌ట్లుగానే ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేటీఆర్ అంత‌టి ప‌రిప‌క్వ‌త లోకేష్ లో ఇంకా రాలేద‌ని వారు సూచిస్తున్నారు. త‌న‌యుడికి పూర్తిస్థాయి బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు బాబు మ‌రింత కాలం వేచి ఉండాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.