Begin typing your search above and press return to search.

టీడీపీ అభ్య‌ర్థిగా ఓడితే!..ప‌క్క‌నుండాల్సిందే!

By:  Tupaki Desk   |   14 March 2019 4:57 PM GMT
టీడీపీ అభ్య‌ర్థిగా ఓడితే!..ప‌క్క‌నుండాల్సిందే!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కీల‌క ఎన్నిక‌ల‌కు ముందు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యం టీడీపీకి ఏ మేర‌కు క‌లిసి వ‌స్తుందో తెలియ‌దు గానీ... పార్టీ అభ్యర్థిగా ఎన్నిక‌ల్లో నిల‌బ‌డి పొర‌పాటున ఓడితే... ఆ నేత‌ల ప‌ని అయిపోయిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ ఎన్నిక‌ల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణ‌యం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఇక‌పై టీడీపీకి సంబంధించి నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌ చార్జీలు ఉండ‌ర‌ట‌. ఇప్ప‌టిదాకా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన నేత‌ల‌నే చంద్ర‌బాబు ఆయా నియోజ‌కవ‌ర్గాల ఇంచార్జీలుగా కొన‌సాగిస్తూ వ‌చ్చారు. ఫ‌లితంగా టీడీపీ విప‌క్షంలో ఉంటే ఎలాంటి గొడ‌వ లేదు గానీ... ఆ పార్టీ అధికారంలో ఉంటేనే అస‌లు గొడ‌వ మొద‌ల‌య్యేది.

టీడీపీ ఓడిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇత‌ర పార్టీలకు చెందిన నేత‌లు ఎమ్మెల్యేలుగా ఉన్నా... అభివృద్ధి కార్యక్ర‌మాల‌న్నీ కూడా ఓడిన టీడీపీ నేత‌ల ద్వారానే జ‌రుగుతోంది. నియోజ‌క‌వ‌ర్గానికి ఇచ్చిన నిధుల‌న్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేకు ఏమాత్రం సంబంధం లేకుండా.... టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీగా ఉండే ఓడిన టీడీపీ నేత‌ల సూచ‌న‌ల మేర‌కే అధికార గ‌ణం ఖ‌ర్చు పెట్టేస్తోంది. అయితే ఈ ఎన్నిక‌ల త‌ర్వాత ఆ త‌ర‌హా ప‌రిస్థితి త‌లెత్త‌నీయ‌న‌న్న కోణంలో చంద్రబాబు ఈ కొత్త నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. అయినా ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో టీడీపీకి గెలుపు అవ‌కాశాలు దాదాపుగా లేవ‌న్న కోణంలో స‌ర్వేల‌న్నీ త‌మ‌దైన లెక్క‌లు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి తాను అధికారంలో లేకుంటే... మ‌రి ఇంచార్జుల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌డం ద్వారా చంద్ర‌బాబు ఎలాంటి ఫ‌లితం రాబ‌డ‌తారో చూడాలి.

అస‌లే పార్టీ అధికారంలో ఉంటేనే... ఓడినా కూడా ఏవో అభివృద్ధి నిధుల మాటున టీడీపీ నేత‌లు ఎంతో కొంత జేబుల్లో వేసుకునే వార‌న్న వాద‌న లేక‌పోలేదు. మ‌రి ఓడిన వారిని ప‌క్క‌న‌పెట్టేస్తే... తిరిగి ఐదేళ్ల త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల దాకా ఆ నేత‌ల‌ను పార్టీలోనే నిలుపుకునేదెలా? ఈ వాద‌న‌ను అలా ప‌క్క‌న‌పెడితే... నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసేస్తే... కార్య‌క‌ర్త‌ల‌కు స‌మాధానం చెప్పేదెవ‌రు? ప‌్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడేది ఎవ‌రు? ఐదేళ్ల‌కు ఓమారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని న‌డిపేదెవ‌రు? ఇలా చంద్ర‌బాబు నిర్ణ‌యం చాలా ప్ర‌శ్న‌ల‌నే లేవ‌నెత్తించ‌ద‌ని చెప్పాలి. మ‌రి ఈ నిర్ణ‌యం చంద్ర‌బాబుకు క‌లిసి వ‌స్తుందో? లేదంటే ఎగ‌త‌న్నుతుందో చూడాలి.