Begin typing your search above and press return to search.

ఆత్మ‌గౌర‌వం అప్పుడేమైంది బాబు?

By:  Tupaki Desk   |   23 Feb 2018 6:12 AM GMT
ఆత్మ‌గౌర‌వం అప్పుడేమైంది బాబు?
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నోటి నుంచి డైలాగుల మీద డైలాగులు వ‌చ్చేస్తున్నాయి. నాలుగేళ్లుగా గుర్తుకు రాని.. స్పృహ‌లోకి రాని మోసం.. ఆత్మ‌గౌర‌వం లాంటివి ఇప్పుడు హ‌టాత్తుగా గుర్తుకు వ‌చ్చేస్తున్నాయి. ప్ర‌త్యేక హోదా ఏపీకి శ్వాస అన్న బాబు నోటి నుంచే హోదా కాదు.. ప్ర‌త్యేక సాయం అంటే ఓకే అనేసిన వైనాన్ని బాబు మ‌ర్చిపోయినట్లున్నారు.

కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని ఆయ‌న‌.. ఇప్పుడు మాత్రం అదే కేంద్రం త‌మ‌ను మోసం చేసింద‌ని మండిప‌డుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. త‌న‌కు కోపం వ‌స్తే అంద‌రూ తిట్టేయాల‌న్న‌ట్లుగా ఉంది బాబు ధోర‌ణి. ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఏపీలోని కొన్ని పార్టీల నేత‌లు కేంద్రాన్ని అడ‌గ‌ర‌ని ఇప్పుడాయ‌న చెబుతున్నారు.

ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో భాగంగా ఆ మ‌ధ్య విశాఖ‌లో శాంతి ర్యాలీ నిర్వ‌హిస్తాన‌ని చెబితే క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణాన్ని సృష్టించిన వైనాన్ని ఏపీ ప్ర‌జ‌లు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. అంతేనా.. ఆ కార్య‌క్ర‌మానికి ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ వ‌స్తే.. విమానాశ్ర‌యంలో అడ్డుకొని నానా యాగి చేసి.. వైజాగ్‌ ను నాశ‌నం చేయ‌టానికి కుట్ర ప‌న్నిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు చేయ‌టం మ‌ర్చిపోలేం. శాంతియుతంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తాన‌ని చెబితే ఒప్పుకోని బాబు.. ఇప్పుడు మాత్రం కేంద్రంపై మోసం.. ఆత్మ‌గౌర‌వం అంటూ విరుచుకుప‌డటం చూస్తే అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు రంగులు మార్చే ధోర‌ణి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల్ని అమ‌లు చేయ‌కుండా ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ తీయొద్ద‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. గ‌డిచిన నాలుగేళ్లుగా మోడీ స‌ర్కారు అదే చేసింద‌ని.. ఆ విష‌యంపై ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడో క్లారిటీ వ‌చ్చినా.. బాబుకు మాత్రం రాలేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్ర‌కారం రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌న్నార‌ని.. ఇక‌పై ఎవ‌రికీ ఇవ్వ‌మ‌ని చెప్పిన వైనాన్ని గుర్తు చేసిన బాబు.. ఏపీకి మాత్రం ప్ర‌త్యేక సాయం చేస్తామ‌ని చెప్పార‌ని చెబుతున్నారు. హోదాకు స‌మానంగా ప్ర‌తిఫ‌లం ఇస్తాన‌ని చెప్పి ఏమీ ఇవ్వ‌లేదంటున్నారు.

తాజాగా కొన్ని రాష్ట్రాల‌కు హోదా పొడిగించ‌టంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇంత‌లా గుండెలు బాదుకుంటున్న చంద్ర‌బాబు కొన్ని విష‌యాల్ని కావాల‌నే మ‌ర్చిపోతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల‌కు అమ‌లు చేస్తున్న ప్ర‌త్యేక హోదాను పొడిగిస్తూ కొన్ని నెల‌ల క్రితం మోడీ స‌ర్కారు కేబినెట్ లో నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఆ విష‌యం మీడియాలోనూ వ‌చ్చింది. అప్పుడు చిన్న కామెంట్ చేయ‌ని చంద్ర‌బాబు ఇప్పుడు మాత్రం.. గుండెలు బాదేసుకుంటున్నారు.

అప్పుడెప్పుడో మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపైన బాబు ఇప్పుడు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తే లాభం ఏమైనా ఉంటుందా? ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ‌.. ప్ర‌త్యేక హోదా మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌న ఆందోళ‌న‌ను అంత‌కంత‌కూ ఉధృతం చేస్తున్న నేప‌థ్యంలో బాబు నోటి కొత్త త‌ర‌హా మాట‌లు రావ‌టాన్ని ఏపీ ప్ర‌జ‌లు గుర్తించ‌క మాన‌రు. హోదా మీద మొద‌ట్నించి ఒకే స్టాండ్ మీద జ‌గ‌న్‌.. ప‌వ‌న్ లు నిల‌బ‌డితే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం త‌న‌కు త‌గ్గ‌ట్లుగా మాట్లాడుతున్నారు.

దేశ ప్ర‌ధాని పార్ల‌మెంటులో ప్ర‌త్యేక హోదా హామీ ఇచ్చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ఆ హామీ మీద చ‌ర్చ జ‌ర‌గ‌టం ఏమిటి? హోదా సాధ్యం కాద‌ని కొత్త‌గా ఎన్నికైన ప్ర‌ధాని చెప్పినంత మాత్రాన విడిచిపెట్టాల్సిన అవ‌స‌రం ఉందా? ఎన్నిక‌ల వేళ భుజం.. భుజం రాసుకుపూసుకు తిరిగి త‌ర్వాత తూచ్ అన్న వ్య‌క్తిని ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌యోజ‌నాల కోసం నిల‌దీయాల్సింది పోయి.. ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ అంటే త‌లాడించిన చంద్ర‌బాబుకు ఇప్పుడీ రోజు మోసం.. ఆత్మ‌గౌర‌వం లాంటి మాట‌లు మాట్లాడే నైతిక హ‌క్కు ఉంటుందా? అన్న ప్ర‌శ్న‌ను ఆంధ్రోళ్లు అడ‌గాల్సిన అవ‌స‌రం ఉంది. లేకుంటే.. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా మాట్లాడే బాబు ప్ర‌మాద‌కారి అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.