Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ నేతలు ఇక కొత్త అల్లుళ్లే...

By:  Tupaki Desk   |   18 March 2017 5:30 PM GMT
ఏపీ బీజేపీ నేతలు ఇక కొత్త అల్లుళ్లే...
X
యూపీలో బీజేపీ తిరుగులేని విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ నేతల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అయితే వారిని మరింత మర్యాదగా చూసుకోవాలని తమ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీచేశారట. వారిని వీఐపీల్లా చూసుకోవాలని కూడా చెబుతున్నారట. ఏ స్థాయిలోనూ మర్యాదల్లో లోపం లేకుండా చూడాలన్నది చంద్రబాబు తాజా ఆదేశంగా తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. బీజేపీ నేతల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ప్రత్యేక సూచనలు చేశారని సమాచారం. ఇకపై బీజేపీ నేతలను నిర్లక్ష్యం చేయవద్దని నేతలకు సూచించారట. పెద్ద నాయకుల నుంచి చోటా నాయకుల వరకు వారికి తగ్గట్టు మర్యాద ఇవ్వాలని సూచించారు. మొన్నటి వరకు బీజేపీ ఏపీలో తమ తోక పార్టీ అని టీడీపీ భావించింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయం సాధించడం, దక్షిణాదిపైనా ఫోకస్ పెడుతామని బీజేపీ నేతలు చెప్పడంతో చంద్రబాబులో ఆందోళన మొదలైందంటున్నారు. అందుకే బీజేపీ నేతలకు మర్యాదలు చేసి వారి కన్ను ఆంధ్రప్రదేశ్ మీద పడకుండా చూసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసినప్పటికీ ఎన్నికల తర్వాత బీజేపీలోని ఒకరిద్దరు అనుకూల నేతలతో తప్ప మిగతా అందరితోనూ సంఘర్షణే నెలకొంది. ఏపీ బీజేపీలోని పలువురు నేతలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు బీజేపీ అధిష్ఠానానికి నివేదికలు పంపూతూనే ఉన్నారు.. తాజాగా పరిస్థితులు మరింత మారడంతో చంద్రబాబు ఇలాంటిది ముందుముందు జరక్కుండా కేంద్రంలోని బీజేపీ కన్ను తనపై పడకుండా జాగ్రత్త పడుతున్నారట. అందుకుగాను మొట్ట మొదట రాష్ర్టంలోని బీజేపీ నేతలను మంచి చేసుకుని నెగటివ్ ఫీడ్ బ్యాక్ వెళ్లకుండా ఉండాలన్నది ఆయన ప్లానుగా తెలుస్తోంది.

ఇంతవరకు బీజేపీ నేతల మాట ఏపీలో పెద్దగా చెల్లుబాటు కాలేదు. చివరకు మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు కూడా పలుమార్లు తనకు ప్రాధాన్యం దొరకడం లేదని.. మాట చెల్లుబాటు కావడం లేదని అక్కడా ఇక్కడా అన్న సందర్భాలున్నాయి. రేషన్ డీలర్ వంటి చిన్నచిన్న విషయాల్లోనూ బీజేపీ నేతల సిఫార్సులను పట్టించుకోలేదన్నది ఆ పార్టీ నేతల ఆరోపణ.

తామేం చేసినా కేంద్రంలో వెంకయ్య మేనేజ్ చేస్తారనే ఉన్నారన్న భావనతోనే చంద్రబాబు అండ్ టీం ఇంతవరకు మిగతా బీజేపీ నేతలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఇకపై అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో ఫలితాల తర్వాత బీజేపీ మరింత బలపడిందన్న సంగతి అర్ధమైంది.. అంతేకాదు.. గోవా, మణిపూర్లలో పూర్తి మెజారిటీ లేకున్నా రాజకీయంగా వారు ఒకట్రెండు రోజుల్లోనే వ్యవహారం చక్కబెట్టి తమ ముఖ్యమంత్రులను కొలువుదీర్చిన విధానం కూడా చంద్రబాబును భయపెట్టిందట. ఈ నేపథ్యంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతుండడం.. టీడీపీ గ్రాఫ్ పతనమవుతుండడం.. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పోటీ చేస్తే మోడీ ఓటు బ్యాంకు తమకు కలిసి వస్తుందన్న నిర్ధారణకు చంద్రబాబు వచ్చినట్టు చెబుతున్నారు. అందువల్లే బీజేపీ నేతలు అడిగే పనులు చేసి పెట్టాలని పార్టీ నేతలకు ఆదేశించినట్టు భావిస్తున్నారు. యూపీలో గెలుపు తర్వాత దక్షిణాదిపై దండెత్తేందుకు సిద్ధమవుతున్న బీజేపీ … ఇప్పుడు వెంకయ్య చెప్పినంత మాత్రాన మౌనంగా ఉండే పరిస్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలకు మర్యాదలు చేసుకోవాలని టీడీపీ నిర్ణయించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా తమపై ఫిర్యాదులు వెళ్లకుండా చూసుకుంటూ తమపై ఆగ్రహం రాకుండా చూసుకోవాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ నేతలను ఇకపై కొత్త అల్లుళ్ల మాదిరిగా చూసుకోవాలని డిసైడైపోయారట.