Begin typing your search above and press return to search.

జంపింగ్ ఎమ్మెల్యేల‌కు బాబు కొత్త ఆఫ‌ర్‌

By:  Tupaki Desk   |   24 Oct 2016 4:41 AM GMT
జంపింగ్ ఎమ్మెల్యేల‌కు బాబు కొత్త ఆఫ‌ర్‌
X
తెలుగుదేశం పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయ‌డమ‌నే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈ క్ర‌మంలో పార్టీ మారిన నేత‌ల‌కు కొత్త ఆఫ‌ర్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నేప‌థ్యంలో అంత‌కుముందే కొన్ని ప్రధాన నామినేటెడ్‌ పోస్టుల్ని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు సమాచారం. గత నెల్లో కొన్ని నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయ‌గా...కొన్నింటికి పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే కీలకమైన పదవులు ఇంకా భర్తీ కాలేదు. ఈ ప్ర‌క్రియ‌కు చంద్ర‌బాబు బీజం వేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండున్నరేళ్ళయింది. పదేళ్ళ పాటు ప్రతిపక్ష హోదాలో అప్పటి ప్రభుత్వ తీరుపై ఉద్యమాలు - పోరాటాలు చేసిన పార్టీ సీనియర్లు పలువురు నామినేటెడ్‌ పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. జరుగుతున్న జాప్యం వారిలో మరింత నిర్లిప్తత పెంచుతోంది. దీంతో కొందరు గత కొన్ని మాసాలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోవడంలేదు. ఇదిలా ఉంటే వైకాపా నుంచొచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయం వివాదాస్పదంగా మారింది. సాక్షాత్తు గవర్నర్‌ కూడా దీన్ని వ్యతిరేకించినట్లు తెలిసింది. తెలంగాణాలో తెలుగుదేశం టికెట్‌తో గెల్చి టీఆర్‌ ఎస్‌ లో చేరిన వారికి మంత్రి పదవులిస్తే చంద్రబాబు గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదుర‌వుతుందంటూ గవర్నర్‌ సూచించడంతో మంత్రి పదవి కాకున్నా ఆ స్థాయి నామినేటెడ్‌ పదవుల్ని వైకాపా నుంచొచ్చిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 20మంది వైకాపా సభ్యులు తెలుగుదేశంలో చేరారు. మరో పది నుంచి పన్నెండుమంది వరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్‌ విభజన అంశం ఇప్పటికీ ఇతమిద్దంగా తేల్లేదు. వచ్చే ఎన్నికల్లోగా విభజన ఉండే అవకాశాల్లేవని వీరు సందేహిస్తున్నారు.

దీంతో పార్టీ మారినప్పటికీ తగిన ప్రయోజనం ఉండదన్న మీమాంశలో ఉన్నారు. మంత్రి పదవి కాకున్నా ఆ స్థాయిలో ఆదాయం, గౌరవం తెచ్చిపెట్టే మరో పదవి ఇస్తానన్నా ముందుకు ఉరికేందుకు సిద్దంగా ఉన్నామంటూ ఇప్పటికే నలుగురైదుగురు సంకేతాలు పంపారు. వీటన్నింటిని దృష్టిలోపెట్టుకుని మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముందే కీలకమైన ఏపీఎస్ ఆర్‌ టీసీ - పౌరసరఫరాలు వంటి కార్పొరేషన్‌ పదవుల భర్తీ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పాటే పట్టణ ప్రాంత ప్రాధికార సంస్థల చైర్మన్లను కూడా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. వీటిలో ఎక్కువ పదవులు వైకాపా నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేలకు లేదా వారు సూచించిన నాయకులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/