Begin typing your search above and press return to search.

‘మండే’ వస్తే చాలు బాబుకు మంటెత్తిపోతోంది

By:  Tupaki Desk   |   21 Feb 2017 7:14 AM GMT
‘మండే’ వస్తే చాలు బాబుకు మంటెత్తిపోతోంది
X
‘మండే’ మంట పుట్టిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి మొదలుకొని.. ఏపీ సర్కారులోని ఉద్యోగులు.. కాంట్రాక్టర్లు.. ఇలా అంతా మండే కారణంగా మండిపోతున్న పరిస్థితి. ఏపీ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని ప్రతి సోమవారం (మండే) సమీక్షించటం మొదలెట్టి చాలా కాలమైంది. ప్రతి సోమవారం.. పోలవరం వారమని.. ఆ రోజున ప్రాజెక్టు పనులు ఎంతవరకూ వచ్చాయన్న విషయంపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పిన చంద్రబాబు.. అందుకు తగ్గట్లే.. రివ్యూ నిర్వహిస్తున్నారు. సమీక్షలు మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటివరకూ ఏ మండే కూడా బాబు సంతృప్తికరంగా ఉన్నది లేదు. అనుకున్న విధంగా పనులు జరగకపోవటంపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సోమవారం ఆయన ఆగ్రహం ఎంతవరకు వెళ్లిందంటే.. ‘‘ఐ విల్ టీచ్ యూ ద లెసెన్’’ అనే వరకూ వెళ్లింది. అంతేనా.. అడ్వాన్స్ ల కోసం ఒత్తిడి చేయటం మీదున్న శ్రద్ధ.. పనులు చేయటం మీద లేదంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

ప్రతి వారం నిర్దేశిస్తున్న పనుల్లో 40 శాతం కూడా పూర్తి కావటం లేదన్న బాబు.. ఇదే తీరులో సాగితే రెండేళ్ల వ్యవధిలో పనులు పూర్తి చేయటం కష్టమని వ్యాఖ్యానిస్తున్నారు. స్పిల్ వే.. స్పిల్ ఛానల్ మట్టి పనుల కోసం ప్రత్యేకంగా ఉప కాంట్రాక్టు సంస్థల్ని ఎంపిక చేసి.. నేరుగా పనులు పర్యవేక్షిస్తూ నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆయన ఆదేశిస్తున్నారు. అంతేకాదు.. డయాఫ్రం వాల్.. కాఫర్ డ్యాం నిర్మాణ బాధ్యతల్ని అంతర్జాతీయ కంపెనీలకు ఇవ్వాలని ఆయన చెబుతున్నారు.

పనులు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు సీఎంవోకు తెలియజేసే బాధ్యత లేదా అని జలవనరుల శాఖ అధికారులపైన మండిపడ్డ బాబు.. పోలవరం ప్రాజెక్టు కోసం ఒక లైజన్ ఆఫీసర్ ను.. ప్రాజెక్టు మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ ను నియమించాలన్నారు. సోమవారం జరిగిన రివ్యూ మీటింగ్ లో.. పనులు జరుగుతున్న తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. సీఎం రివ్యూ తర్వాత.. సీనియర్ అధికారులు.. కాంట్రాక్టు సంస్థలతో మరోసారి భేటీ కావటం గమనార్హం. మొత్తానికి పోలవరం అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకే కాదు.. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి బీపీని తీసుకొస్తుందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/