Begin typing your search above and press return to search.

అమిత్ షా అంటే చంద్ర‌బాబుకు అంత భ‌య‌మా?

By:  Tupaki Desk   |   25 May 2017 4:37 AM GMT
అమిత్ షా అంటే చంద్ర‌బాబుకు అంత భ‌య‌మా?
X
న‌మ్మి ఓట్లు వేసి.. అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌లు ముఖ్య‌మా? అంకెల బ‌లాన్ని న‌మ్మేసుకొని.. వారికి దాసులుగా ఉండ‌టం.. రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల్ని ప‌ణంగా పెట్ట‌టం ముఖ్య‌మా అని చూసిన‌ప్పుడు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం మొద‌టి దాని కంటే రెండో దానికే ప్రాధాన్య‌త ఇస్తార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇటీవ‌ల త‌న మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. అమిత్ షా చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్ధాలుగా తేల్చేసిన కేసీఆర్.. త‌న‌దైన మాట‌ల‌తో ఆయ‌న్ను క‌డిగి పారేశారు.

తెలంగాణ త‌మ‌కు బాద్ షా అంటూ అమిత్ షాపై విరుచుకుప‌డిన కేసీఆర్‌.. ఆయ‌న మాట‌లు నిజ‌మ‌ని నిరూపిస్తే త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌న్న స‌వాల్‌ను విసిరారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లుచోట్ల మాట్లాడిన అమిత్ షా.. గ‌డిచిన మూడేళ్ల‌లో తెలంగాణ రాష్ట్రానికి రూ.ల‌క్ష కోట్లు ఇచ్చిన‌ట్లుగా పేర్కొన్నారు.

దీనిపై తాజాగా స్పందించిన కేసీఆర్‌.. కేంద్రానికి తామే సాయం చేస్తున్నామే త‌ప్పించి.. కేంద్రం త‌మ‌కు సాయం చేస్తున్న‌ది ఏమీ లేద‌ని చెబుతూ.. అందుకు త‌గ్గ గ‌ణాంకాల్ని ఉటంకించారు. త‌మ‌లాంటి సంప‌న్న రాష్ట్రం కేంద్రానికి నిధులు స‌మ‌కూరుస్తుంద‌ని.. తాము ఇచ్చిన ఆదాయంతో పోలిస్తే.. కేంద్రం త‌మ‌కిచ్చిన ఆదాయం చాలా త‌క్కువని తేల్చేశారు. కేసీఆర్ మాట‌ల్ని చూస్తే.. త‌మ రాష్ట్రాన్ని త‌క్కువ చేసి చూపించే వారు ఎవ‌రైనా స‌రే.. తాను ఉపేక్షించ‌నని తేల్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది.

మ‌రి.. కేసీఆర్ త‌ర‌హాలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎందుకు వ్య‌వ‌హ‌రించ‌ర‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. అమిత్ షా లెక్క‌ల్ని చీల్చి చెండాడిన కేసీఆర్ త‌ర‌హాలో.. ఏపీ సీఎం బాబు ఎందుకు చేయ‌లేక‌పోతున్నార‌న్న‌ది ప‌లువురి నోట వినిపిస్తున్న సందేహం. ఏడాది కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించిన అమిత్ షా.. త‌న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఏ రీతిలో అయితే లెక్క‌లు చెప్పారో.. అలాంటి కాకి లెక్క‌ల్ని ఏపీ ప్ర‌జ‌ల‌కు వినిపించారు. విభ‌జ‌న హామీల్ని నెర‌వేర్చే విష‌యంలో ఘోరంగా విఫ‌ల‌మైన మోడీ స‌ర్కారుకు భిన్నంగా.. ఏపీకి తామెంతో చేస్తున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

అమిత్ షా మాట‌ల్లో నిజం లేకున్నా.. చంద్ర‌బాబు మాత్రం ఆ మాట‌లకు ఎలాంటి కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోవ‌టం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాష్ట్ర ప్ర‌జ‌లు.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల ముందు అమిత్ షా ఎంత‌టివాడ‌న్న మాట‌ను ప‌లువురు ఫీలైనా.. బాబు మాత్రం అమిత్ షా చెప్పిన అస‌త్యాల్ని ఖండించిన పాపాన పోలేదు. విభ‌జ‌న కార‌ణంగా రాజ‌ధానిని పోగొట్టుకున్న ఏపీకి కేంద్రం ఇంత‌వ‌ర‌కూ ఏమీ ఇవ్వ‌లేద‌న్నది తెలిసిందే. ఆ విష‌యాన్ని కేంద్రం దృష్టికి స‌మ‌ర్థంగా తీసుకెళ్లి నిధులు రాబ‌ట్ట‌టంలో బాబు విఫ‌ల‌మైన ఆరోప‌ణ ఉంది.

నిధులు తేవ‌టం త‌ర్వాత సంగ‌తి.. క‌నీసం డాబు మాట‌లు చెబుతున్న అమిత్ షా లాంటి వారి మాట‌లు అస‌త్యాల‌న్న విష‌యాన్ని బాబు ఎందుకు గ‌ట్టిగా చెప్ప‌లేక‌పోతున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. మిత్ర‌ప‌క్షంగా మ‌ర్యాద ఇవ్వ‌టం త‌ప్పేం కాదు. కానీ.. ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టిస్తూ చేసే వ్యాఖ్య‌ల్ని ఖండించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఆ విష‌యంలో కేసీఆర్ ప్ర‌ద‌ర్శించిన క‌మిట్ మెంట్ ముందు బాబు మాట‌లు.. చేత‌లు చేత‌కానిత‌నంగా క‌నిపిస్తున్న భావ‌న‌ను క‌లిగిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ.. అమిత్ షా అంటే బాబుకు ఎందుకంత భ‌యం? ఎందుకంత ఒదిగి ఒదిగి మ‌రీ వ్య‌వ‌హ‌రిస్తుంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/