Begin typing your search above and press return to search.

బాబూ... ఎన్నిక‌ల దాకా డిజైన్ల‌తోనే లాగిస్తారా?

By:  Tupaki Desk   |   18 March 2017 9:04 AM GMT
బాబూ... ఎన్నిక‌ల దాకా డిజైన్ల‌తోనే లాగిస్తారా?
X
ఏపీలో ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌ధాని కూడా లేకుండానే 13 జిల్లాల‌తో నవ్యాంధ్ర తీవ్ర ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రంగా అవ‌త‌రించింది. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఇచ్చిన రుణ‌మాఫీ - నిరుద్యోగ భృతి త‌దిత‌ర హామీల‌తో టీడీపీ విజ‌యం సాధించ‌గా, ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సీఎంగా ప‌ద‌వీ బాధ్యత‌లు స్వీక‌రించారు. కొత్త‌గా కొలువుదీరిన త‌మ స‌ర్కారు... వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌పంచంలోనే అత్యంత సుంద‌ర‌మైన రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించి తీరుతుంద‌ని కూడా నాడు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న చేసి ఇప్ప‌టికే దాదాపుగా మూడేళ్ల కాలం గ‌డియిపోతోంది. మ‌రో రెండేళ్లు ఉంటే మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చేస్తాయి. మ‌రి ఎన్నిక‌ల్లోగా న‌వ్యాంధ్ర‌కు సుంద‌ర న‌గ‌రం రాజ‌ధానిగా అవ‌త‌రిస్తుందా? అంటే... అది ప‌గ‌టి పూట కనే క‌లేన‌న్న వాద‌న జ‌నం నుంచి వినిపిస్తోంది.

న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో కొన‌సాగుతున్న నిర్మాణ ప‌నుల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తూ జ‌నం చేస్తున్న వాద‌న‌ను ఏ ఒక్క‌రు కూడా త‌ప్పు అని చెప్పే ప‌రిస్థితులు కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి ఆ వివ‌రాల్లోకెళితే... చంద్రబాబు స‌ర్కారు గ‌ద్దెనెక్కాక‌... న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానిగా గుంటూరు జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చే మంగ‌ళ‌గిరి ప్రాంతాన్ని ఎంపిక చేశారు. రాజ‌ధాని స్థ‌ల ఎంపిక కోసం కేంద్ర నియ‌మించిన శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ వ‌ద్ద‌ని వారించినా కూడా మంగ‌ళ‌గిరి ప్రాంతాన్నే చంద్ర‌బాబు స‌ర్కారు ఎంపిక చేసింద‌న్న క‌థ‌నాలు నాడు వినిపించాయి. ఎంపిక చేసిన త‌ర్వాత బాబు అండ్... రాజ‌ధాని ఎలా ఉండాల‌న్న దానిని తేల్చేందుకు ప్ర‌పంచ దేశాల్లోని ప‌లు న‌గ‌రాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌లు చేసింది. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో సింగ‌పూర్‌ - జ‌పాన్‌ - మ‌లేసియా - బ్రిట‌న్‌... చివ‌ర‌కు చైనా కూడా ఉన్నాయి. ఎట్ట‌కేల‌కు ఆ ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ వృథాయేన‌ని తేల్చేస్తూ... రాజ‌ధాని డిజైన్ల రూప‌క‌ల్ప‌న‌ను సింగ‌పూర్ క‌న్సార్టియంకు అప్ప‌గించిన బాబు స‌ర్కారు... ఆ డిజైన్ల పేర్లు చెప్పే కాలం గ‌డిపేస్తుంది.

అధికారం చేప‌ట్టిన త‌ర్వాత ఎంపిక చేసిన రాజ‌ధానిలో ఇప్ప‌టిదాకా నిర్మాణం పూర్తి చేసుకున్న నిర్మాణాలు రెండంటే రెండు మాత్ర‌మేన‌న్న విష‌యాన్ని కూడా ఇక్క‌డ మ‌రిచిపోరాదు. అవి కూడా ఆరు నెల‌ల క్రితం పూర్తి అయిన తాత్కాలిక స‌చివాలయం - ఇటీవ‌లే అందుబాటులోకి వ‌చ్చిన తాత్కాలిక అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయం. ఈ రెండు కూడా తాత్కాలిక భ‌వ‌నాలేన‌న్న విష‌యాన్ని కూడా జ‌నం ప్ర‌తిసారీ ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు. కేవ‌లం రెండు తాత్కాలిక భ‌వ‌న స‌ముదాయాల‌ను మాత్ర‌మే పూర్తి చేయ‌డానికి బాబు స‌ర్కారుకు మూడేళ్ల స‌మ‌యం ప‌డితే... ఇక ప్ర‌పంచంలోనే సుంద‌ర‌మైన రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించేందుకు ఎంత‌కాలం ప‌డుతుంది? ఈ ప్ర‌శ్న‌కు ఒక్కొక్క‌రి నుంచి ఒక్కో స‌మాధానం వినిపిస్తుంటే... బాబు అండ్ కో మాత్రం ఇదుగో, అదుగో అంటూ స‌మాధానం దాట‌వేస్తోంది. బాబు స‌ర్కారు నుంచి వినిపిస్తున్న ఈ స‌మాధానాల‌ను త‌ర‌చి త‌ర‌చి చూస్తున్న జ‌నం మాత్రం... ఈ రెండు తాత్కాలిక భ‌వ‌నాలు, మొన్న‌టిదాకా రోజూ ప్ర‌స్తావించిన డిజైన్ల పేర్లు చెప్పే బాబు స‌ర్కారు మిగిలిన రెండేళ్ల కాలాన్ని న‌డిపించేస్తుంద‌ని చెబుతున్నారు. చూద్దాం... మరి ఏం జ‌రుగుతుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/