సెలవు ఇచ్చేందుకు కక్కుర్తి ఏంది బాబు?

Fri Aug 17 2018 13:14:57 GMT+0530 (IST)

ఏం ఆలోచిస్తారో కానీ.. సందర్భానికి ఏ మాత్రం సూట్ కాని మాటలు చెప్పటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా.  ప్రతి దానికి పనికిరాని నీతులు చెప్పి.. వేలెత్తి చూపించే తరహా ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. భారత రాజకీయాల్లో శిఖర సమానుడు.. విలువలతో రాజకీయాలు చేసిన అత్యున్నత వ్యక్తిత్వం అటల్ జీ సొంతం. అలాంటి కీలక నేత మరణించిన వేళ.. ఆయన మృతికి సంతాపంగా సెలవును ప్రకటించటం గౌరవంగా చెప్పాలి.ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి.. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల వారు తమకు తాముగా సెలవును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాస్త ఆలస్యంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం శుక్రవారం ప్రభుత్వ సెలవుగా ప్రకటిస్తూ.. సీఎంవో నిర్ణయాన్ని వెల్లడించింది దీంతో.. శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు.. విద్యా సంస్థలకు సెలవు ఇచ్చేశారు.

వాజ్పేయి మరణంతో నెలకొన్న విషాదం నేపథ్యంలో పలు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం పలువురి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే.. వాజ్పేయి  చక్కటి సంబంధాలు ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సెలవు ఇవ్వలేదు. ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు ప్రకటించారు. సంతాప దినాల విషయంలో వేలెత్తి చూపించే అంశం లేకున్నా.. సెలవు ప్రకటించటంపై ఆయన చెప్పిన మాటల్ని విన్నంతనే ఒళ్లు మండిపోయే పరిస్థితి.

వాజ్ పేయికు సెలవు అంటే ఇష్టం ఉండదని.. అందుకే తాము సెలవు ప్రకటించటం లేదని బాబు పేర్కొన్నారు. వాజ్పేయి ఆదర్శాల్ని వల్లె వేస్తున్న చంద్రబాబు.. ఆయన తరహాలోనే విలువలతో కూడిన రాజకీయాలు ఎందుకు చేయలేదు?  వేరే పార్టీలో గెలిచిన అభ్యర్థుల్ని అక్రమ పద్ధతిలో పార్టీలోకి తీసుకురావటం.. వారికి మంత్రి పదవులు ఇవ్వటం దేనికి నిదర్శనం?

నికృష్ట రాజకీయాల్లో భాగంగా ఓటుకు నోటు ఇష్యూలో అడ్డంగా దొరికిపోయిన బాబు.. వాజ్ పేయి  సిద్దాంతాల్ని.. ఆదర్శాల్ని వల్లె వేయటం ఏ మాత్రం బాగోలేదన్న మాట వినిపిస్తోంది. సెలవు ఇచ్చేందుకు బాబు చెప్పిన మాట ఏ మాత్రం అతికినట్లుగా లేదన్న విమర్శ పలువురి నోటి నుంచి వస్తోంది.

వాజ్పేయికి నచ్చినట్లుగా.. ఆయన మనసుకు మెచ్చినట్లుగా.. పెద్దాయన ఆదర్శాలకు తగ్గట్లుగా ఉండటమంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆదర్శాల పేరుతో పనికిమాలిన రీతిలో వ్యవహరించటం బాబుకు మాత్రమే సాధ్యమన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. వాజ్ పేయ్ మృతి నేపథ్యంలో ఢిల్లీ.. ఉత్తరప్రదేశ్.. ఉత్తరాఖండ్.. మధ్యప్రదేశ్.. బిహార్.. తమిళనాడు.. తెలంగాణ..  పుదుచ్చేరి తదితర ప్రభుత్వాలు సెలవును ప్రకటించిన రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.