మైక్రోపూలింగ్..బాబుకు నచ్చిన చెత్త ఆలోచన

Thu Jun 14 2018 14:08:08 GMT+0530 (IST)

ప్రజల మీద ప్రభుత్వ అజమాయిషీ ఎపుడూ చాప కింద నీరులా మనకు తెలియకుండానే ప్రవహిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే గాని వెంటనే అర్థం చేసుకోవడం కష్టం. ఇపుడు చంద్రబాబు చేపట్టి మరో మిషన్ ఏపీకి అలాంటిదే. హైదరాబాదు కట్టిన నేను మాత్రమే అమరావతి కట్టగలను అని చెప్పి ప్రజలను నమ్మించిన చంద్రబాబుకు అధికారం చేతికొచ్చింది. ప్రజాస్వామ్యం అంటే నమ్మి పాలన అప్పగించడమే. కానీ ప్రజలు ఇప్పటికే చాలా వాటిలో మోసపోయారు. బాబు చేసిన మాయలో అతిపెద్ద మాయ అమరావతి సేకరణ. నిజానికి మొదట్లో ప్రతిపక్షాలు భూసేకరణ గురించి అనుమానాలు వ్యక్తం చేస్తే అది అక్కసు అనుకున్నారు. అసలు భూములు ఇచ్చిన రైతులు కూడా ప్రతిపక్షాల మాట వినకుండా చంద్రబాబుకు భూములు అప్పగించారు. తీరాచూస్తే పొలం గవర్నమెంటు చేతికి వెళ్లింది గాని తిరిగి రావాల్సిన రైతుల వాటా రైతులకు అంత ఈజీగా దక్కలేదు. నాలుగేళ్లు గడిచాయి. పంట లేదు. ఊహించిన అమరావతి రాలేదు.స్థానిక ప్రజలు బంగారు పంట పండే భూములను ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఏడాదికింత గవర్నమెంటు ఇచ్చే పరిహారం ఏ మూలకు చాలదు. కానీ ఇంటర్నేషనల్ సిటీ కనుక ఇక్కడ వస్తే మనకు తిరిగొచ్చే వాటా భూమితోనే మనం కోటీశ్వరులు అవుతామని - పిల్లలు కళ్ల ముందే ఉంటారు వారి భవిష్యత్తు బాగుంటుందని భావించి బాబుకు అప్పగించారు. కానీ చంద్రబాబుది ప్రచారమే గాని వాస్తవం కాదని తేలిపోయింది. గ్రాఫిక్స్ చూపించడంతోనే నాలుగేళ్లు గడిపేశారు. ఇపుడు రైతులు నోరు విప్పలేరు. గట్టిగా ప్రశ్నించలేరు. ఎందుకంటే స్వయంగా వాళ్లే సర్కారుకు అప్పగించి సంతకాలు పెట్టారు. ఇప్పటికే కుంగిపోతున్న రైతులపై తాజాగా మరో బాంబ్ వేసేలా పరిస్థితి కనిపిస్తోంది.

బుధవారం అమరావతిలో ఒక సదస్సు జరిగింది. ఇండియా టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు అందులో పాల్గొన్నాయి. టాప్ 10 కంపెనీలకు ప్రభుత్వం భూమి ఇస్తుందట. వారు వరల్డ్ క్లాస్ బిల్డింగులు కట్టివ్వాలి. కొంత సర్కారుకు. కొంత వారికి. ఇక ఇది ఎంత పారదర్శకంగా జరుగుతుందన్నది ఆ దేవుడికే తెలియాలి. కానీ ఆ మీటింగ్ సందర్భంగా ఒక బిల్డర్ కంపెనీ చేసిన ప్రతిపాదన బాబుకు నచ్చింది. అదేంటంటే.... ఇప్పటికే రైతుల వాటాకు వచ్చిన భూమిని మళ్లీ సేకరించి అద్భుతాలు సృష్టిస్తాం. దానికి సీఆర్డీఏ సహకారం కావాలి. అంటే ఎకరంలో నాలుగో వంతు తిరిగిచ్చిన భూమిపై కూడా రియల్టర్లు కన్నేశారు. దానికి ముఖ్యమంత్రి ఒప్పుకోవడం అంటే.... ఇది అనేక పరిణామాలకు దారితీస్తుంది. దీనిని మైక్రో పూలింగ్ అంటారు. డెవలప్‌మెంటు పేరి చెప్పి మళ్లీ రైతుల భూములు తీసుకుంటారన్నమాట. ఒకవేళ ఎవరికైనా ఇష్టం లేకపోతే వారిపై గవర్నమెంటు బలాత్కారం చేయడానికే సీఆర్డీఏ సహకారం. అంటే చేతికొచ్చిన పావు వంతు భూములకు కూడా బాబు ఎసరు పెట్టనున్నారా? బాబోయ్!