Begin typing your search above and press return to search.

తెలంగాణ‌పై బాబు రూటు మార్చారు

By:  Tupaki Desk   |   11 Feb 2016 6:52 AM GMT
తెలంగాణ‌పై బాబు రూటు మార్చారు
X
30 ఏళ్ల పాటు పార్టీతో అనుబంధం కొన‌సాగించిన సీనియ‌ర్ ఎమ్మెల్యేలు - పార్టీ నేత‌లు ఒక‌రి వెంట ఒక‌రు సైకిల్ దిగి కారెక్క‌డం తెలుగుదేశం వ‌ర్గాలను తీవ్ర షాక్‌ కు గురిచేసింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు కొడిగ‌ట్టుకుపోతున్న నేప‌థ్యంలో ఆ పార్టీ అధినేత-ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా పెద్ద ఎత్తున టార్గెట్ పెట్టుకొని కొత్త స్కెచ్‌ తో ముందుకుపోయేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం త‌న త‌న‌యుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కు దిశానిర్దేశం చేశారు.

విజయవాడకు వెళ్లిన లోకేష్ పార్టీ అధినేత‌, త‌న తండ్రి నారా చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమమ‌య్యారు. పార్టీకి రాజీనామాచేసి తెరాసలో చేరిన కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద వ్యవహారంతో పాటు పార్టీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు - రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు - ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన అంశాన్ని చర్చించారు. పార్టీ ఎమ్మెల్యేల వలసలు, జీహెచ్‌ ఎంసీ ఎన్నికల ఫలితాలు, వివిధ రకాల కమిటీల కూర్పు, తదితర అంశాలపై లోకేష్ ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతానికి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేశారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్నిరకాల కమిటీలను నియమించి 2019 ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని అగ్ర‌నేత‌లు నిర్ణయించారు. సత్వరమే తెదేపా శాసనసభ పక్షనేతను నియమించాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిలో యువతను ఎంపిక చేయాలని వీరిరువురు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో గ్రామ కమిటీల మొదలు మండల - రెవిన్యూ డివిజన్‌ - జిల్లా స్థాయి కమిటీల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలని, అసెంబ్లీ నియోజకవర్గాలకు వెనువెంటనే బాధ్యులను ఎంపికచేసి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాదంతా తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని గతంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన బహిరంగసభలను కొనసాగించాలని ఈ సమావేశంలో డిసైడ్ చేశారు. మొత్తంగా సైకిల్‌కు తెలంగాణ‌లో రిపేర్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టి వేగంగా దూసుకుపోయే మిష‌న్‌కు టీడీపీ అగ్ర‌నేత‌లు శ్రీ‌కారం చుట్టారు.