Begin typing your search above and press return to search.

చంద్రబాబు - కాంగ్రెస్ క్విడ్ ప్రోకో

By:  Tupaki Desk   |   15 Dec 2018 8:29 AM GMT
చంద్రబాబు - కాంగ్రెస్ క్విడ్ ప్రోకో
X
హిందీ బెల్ట్‌ లోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాన్ని చంద్రబాబు తన క్రెడిట్ లో వేసుకున్న సంగతి తెలిసిందే.. అక్కడ ఒక్క రోజు కూడా ప్రచారం చేయకుండా.. అక్కడ రాజకీయాలు తెలియకుండా చంద్రబాబు ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపును తన ఘనతగా చెప్పుకోవడాన్ని చాలామంది వెటకారం చేస్తుండొచ్చు.. కానీ, చంద్రబాబు మాటల్లోని అసలు అర్థాన్ని - ఏం జరిగిందన్నది ప్రజలు గ్రహించాల్సి ఉంది. ఏపీలో అడ్డగోలు అవినీతితో వేల కోట్లు సంపాదించిన చంద్రబాబు - తెలుగుదేశం పార్టీలు రాష్ట్రాలకు రాష్ట్రాలనే కొనేసే స్థాయిలో ఉన్నాయిప్పుడు. ఆ క్రమంలోనే కాంగ్రెస్‌ తో పొత్తు సమయంలోనే రాజస్థాన్ - చత్తీస్‌ గఢ్ - మధ్యప్రదేశ్‌ లలో తమ పార్టీ విజయం కోసం భారీగా ఫైనాన్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీతో ఒప్పందం కుదుర్చుకుందని వినిపిస్తుంది. నవంబరులోనే అశోక్ గెహ్లాట్ వచ్చి చంద్రబాబుతో సమావేశం కావడం కూడా అందరిలో నెలకొన్న సందేహాలకు బలం చేకూరుస్తోంది.

ఏపీలో నాలుగున్నరేళ్లుగా అడ్డగోలుగా దోపిడీకి పాల్పుడుతన్న చంద్రబాబు మూడు హిందీ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు భారీగా నిధులు సమకూర్చారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చత్తీస్‌ గఢ్ - మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలంగా అధికారంలో లేకపోవడంతో అక్కడి కాంగ్రెస్ నేతలు ఆర్థికంగా దెబ్బతిన్నారు. దీంతో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బు సమకూర్చే పనిని చంద్రబాబు తలకెత్తుకున్నారన్నది దిల్లీ స్థాయిలో వినిపిస్తోంది.

ఏపీలో చంద్రబాబు - టీడీపీ నేతలు రూ.3 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శులుగా చేసిన ఐవైఆర్‌ కృష్ణారావు - అజేయ కల్లం లాంటి ఉన్నతాధికారులే టీడీపీ సర్కారు అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నారు. ఇటీవల ఆదాయపన్ను శాఖ దాడుల్లో టీడీపీ నేతల అవినీతి బండారం బట్టబయలవుతోంది. ఇవన్నీ ఏపీలో టీడీపీ అవినీతికి తార్కాణాలు కాగా.. ఈ అవినీతి అంతా కేసులుగా మారడం ఖాయం కాబట్టి అప్పుడు తమను బయటపడేయాలని కోరుతూ.. అందుకు ప్రతిఫలంగా ఎన్నికల్లో ఫైనాన్స్ చేస్తానని ప్రతిపాదిస్తూ చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తులకు వెళ్లారన్నది బహిరంగంగా వినిపిస్తున్న ఆరోపణ.

చంద్రబాబు ఒక్క తెలంగాణకు రూ.1200 కోట్లు సర్దుబాటు చేశారని.. మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - చత్తీస్‌ గఢ్‌ లకు అంతకంటే ఎక్కువ మొత్తమే తరలించారని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ఫోకస్ మొత్తం తెలంగాణపై ఉన్న సమయంలో టీడీపీ నేతల్లో చాలామంది రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - చత్తీస్ గఢ్‌ లలో తిష్ఠ వేశారని.. అక్కడకు డబ్బు తరలించడం - పంపిణీ చేయడం వంటి పనుల్లో మునిగితేలారని సమాచారం. చివరి రోజున భారీగా డబ్బు పంపిణీ కారణంగానే మధ్యప్రదేశ్‌ లోకాంగ్రెస్ గట్టెక్కిందని తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో బీజేపీ 109 సీట్లు గెలుచుకోగా... అంతకంటే కొంచెం ఎక్కువగా కాంగ్రెస్‌ 114 సీట్లులో విజయం సాధించింది. చివరి నిమిషంలో అనుసరించిన వ్యూహంతో 32 స్థానాల్లో కాంగ్రెస్‌ వెయ్యి లోపు ఓట్ల మెజార్టీతో గెలిచి అధికారానికి చేరువైంది. గత ఎన్నికల కంటే బీజేపీకి 2 శాతం ఓట్లు పెరిగినప్పటికీ సీట్లు మాత్రం తగ్గడం వెనుక కాంగ్రెస్‌‌ కు చంద్రబాబు ఆఖర్లో సరఫరా చేసిన డబ్బే కారణమని టాక్.