ఎన్ ఏఐకు జగన్ కేసు!..బాబుకు బాధ ఎందుకో?

Sat Jan 12 2019 17:45:53 GMT+0530 (IST)

ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపడితే... టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఎందుకు ఉలికిపడుతున్నారన్న విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజా సంకల్ప యాత్రలో కొనసాగుతున్న సమయంలో హైదరాబాదు వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన సందర్భంగా జగన్‌పై ఎయిర్ పోర్టు కేంటిన్‌లో పనిచేస్తున్న ఓ యువకుడు పందెం కోళ్ల కాళ్లకు కట్టే కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిపోయిన రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్... అదో చిన్న విషయమంటూ విపక్ష నేతపై జరిగిన దాడిని తక్కువ చేసే యత్నం చేశారు. ఆ తర్వాత సీఎం హోదాలోని చంద్రబాబు కూడా మీడియా ముందుకు వచ్చి మరీ... జగనే స్వయంగా దాడి చేయించున్నారంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు కూడా తెలిసిందే. తెలుగు తమ్ముళ్లు - టీడీపీ అనుకూల మీడియా అయితే చెప్పనే అవసరం లేదు. దాడి చేసిన వ్యక్తి వైసీపీ కార్యకర్తే అని ప్రజల నుంచి సానుభూతి కోసం జగనే దాడి చేయించుకున్నారని కూడా నానా యాగీ చేశారు.ఈ క్రమంలోనే ఈ దాడిపై దర్యాప్తు కోసమంటూ చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసును నీరగార్చే దిశగానే సాగుతోందని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. స్వయంగా జగన్ కూడా ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఏకంగా హైకోర్టును ఆశ్రయించగా... ఇటు చంద్రబాబు సర్కారు కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ ఏఐకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే చేసేది లేక తమ దర్యాప్తు సాఫీగా సాగేందుకు ఎన్ఐఏ ఏకంగా కోర్టును ఆశ్రయించి కేసు విశాఖ నుంచి విజయవాడకు బదిలీ చేయించుకోవడంతో పాటుగా నిందితుడు శ్రీనివాసరావును కూడా కోర్టు అనుమతితోనే తన కస్టడీలోకి తీసుకుంది. విచారణ కోసం ఎన్ఐఏ ఇప్పటికే నిందితుడిని హైదరాబాదు తరలించేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన చంద్రబాబు... ఈ కేసును ఎన్ఐఏకు ఎలా అప్పగించేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసేశారు. ఈ కేసును ఎన్ ఐఏకు అప్పగించిన తీరుపై నిప్పులు చెరిగిన చంద్రబాబు... ఎన్ ఐఏ చట్టంలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘ లేఖనే రాశారు.

ఈ లేఖలో చంద్రబాబు ఏం ప్రస్తావించారన్న అంశానికి వస్తే... *గత డిసెంబర్ 25న విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జరిగిన దాడి కేసును ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దారుణం. ఇప్పటికే ఈ కేసును రాష్ట్ర అధికారులు విచారిస్తున్నారు. ఎన్ఐఏ చట్టం 2008 ప్రకారం అంతర్ రాష్ట్ర అంతర్జాతీయ లింకులు ఉన్న క్లిష్టమైన కేసులను మాత్రమే ఎన్ఐఏ విచారించాలి. డ్రగ్స్ - ఆయుధాల స్మగ్లింగ్ ఫేక్ కరెన్సీ చలామణి సరిహద్దుల గుండా అక్రమ చొరబాట్లు తదితర అంశాలను మాత్రమే ఎన్ఐఏ చూసుకోవాలి. 2008లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఐఏ చట్టాన్ని మోదీ వ్యతిరేకించారు. ఇప్పుడు అదే చట్టాన్ని అనుసరిస్తూ జగన్ పై దాడికి సంబంధించిన కేసును ఎన్ఐఏకి అప్పగించారు. వ్యక్తిగత కేసును కూడా ఎన్ఐకే అప్పగించడం దారుణం* అని చంద్రబాబు ఆ లేఖలో ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే... జగన్ పై దాడి కేసు దర్యాప్తును ఎన్ ఐఏ తీసుకోవడం కేసు దర్యాప్తులో దూకుడు పెంచడం చంద్రబాబుకు ఇష్టం లేదని చెప్పక తప్పదు. అంటే... ఎన్ఐఏ దర్యాప్తులో వాస్తవాలు బయటకు వచ్చి ఈ కేసు తన మెడకే చుట్టుకుంటుందా? అన్న భయం కూడా చంద్రబాబుకు పట్టుకున్నట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి.