Begin typing your search above and press return to search.

బాబు భూ సంతర్పణకు అడ్డూ అదుపుండదా?

By:  Tupaki Desk   |   20 July 2017 5:17 PM GMT
బాబు భూ సంతర్పణకు అడ్డూ అదుపుండదా?
X
‘‘అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో ..’’ అని సామెత...! ఆ చందంగానే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన వ్యవహార సరళి కనిపిస్తోంది. కోట్లకు కోట్ల రూపాయల విలువైన భూములను రైతులనుంచి బలవంతంగా కొనుగోలుచేసి.. అడ్డగోలుగా ఆ భూముల్ని వివిధ సంస్థల్ని ఆహ్వానిస్తున్నాం అనే నెపంతో ధారదత్తం చేసేయడానికి నారా చంద్రబాబునాయుడు తెగిస్తున్నారు. ‘ఉన్నత ప్రమాణాల స్థాయిగల యూనివర్సిటీలు’ అనే ముసుగులో అచ్చంగా... వందల ఎకరాల భూముల్ని ఉచితంగా కూడా ఇచ్చేయడానికి తాను సిద్ధం అని ప్రకటించడం ద్వారా.. చంద్రబాబు ఈ భూసంతర్పణను ఎంత ఘోరంగా చేయడానికి స్కెచ్ వేసుకుంటున్నారో అర్థమవుతుంది.

వివరాల్లోకి వెళితే.. అమరావతి ప్రాంతంలో వివిధ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమృత్, ఎస్ఆర్‌ఎం వంటి యూనివర్సిటీలకు ఒక్కోదానికి 200 ఎకరాల వంతున స్థలాలను కారుచౌక ధరలకు చంద్రబాబునాయుడు ధారాదత్తం చేసేశారు. అయినా ఒక యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్ని ఎకరాల భూమి సరిపోతుంది! రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏ యూనివర్సిటీ అయినా ఇంత విస్తీర్ణంలో ఉన్నాయా? అమరావతిలో ప్రారంభంచబోయే ప్రెవేటు యూనివర్సిటీల వారు అంతకంటె గొప్పగా చేస్తారా? అనే ప్రాక్టికల్ అంశాలను వేటినీ సీఎం పరిగణనలోకి తీసుకోలేదు. తాను తలచిందే తడవుగా వారికి 200 ఎకరాల వంతున సంతర్పణ చేశారు. ఫరెగ్జాంపుల్ అమృత్ యూనివర్సిటీనే తీసుకుంటే ఇప్పటికే మూడుచోట్ల వారి క్యాంపస్ లు ఉన్నాయి. బెంగుళూరులో వారు సొంతంగా ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద క్యాంపస్ విస్తీర్ణం 87 ఎకరాలు మాత్రమే. చంద్రబాబు మాత్రం వారికి ఇక్కడ అప్పనంగా దోచిపెట్టారు.

తాజాగా సీఆర్డీఏ అధికార్లతో సమీక్షించిన చంద్రబాబు.. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు అమరావతికి వచ్చేట్లయితే అవసరమైన భూమిని ఉచితంగా ఇచ్చేందుకైనా సిద్ధమేనని అంటూ.. సంతర్పణకు లాకులు ఎత్తేశారు. ఈ ముసుగులో ఎన్ని రకాల వక్ర దోపిడీలకు పాలకపక్షంలోని పెద్దలు పాల్పడుతారో అని, ఉచితంగా భూములు పుచ్చుకునే సంస్థలు విద్యను ఉచితంగా ఏమైనా అందిస్తాయా? చదువులతో వ్యాపారం చేయకుండా ఉంటాయా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబునాయుడు.. అమరావతికి తాను ఎక్కడెక్కడినుంచో సంస్థలను తీసుకువస్తున్నా అనే భ్రమను ప్రజల్లో కల్పించడం కోసం.. ప్రెవేటు సంస్థలకు రాజధానిని తాకట్టు పెట్టేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.