Begin typing your search above and press return to search.

సుహాసిని గెలుపునకు బాబు మోకాలడ్డు

By:  Tupaki Desk   |   18 Nov 2018 1:30 AM GMT
సుహాసిని గెలుపునకు బాబు మోకాలడ్డు
X
తెలంగాణలో ఎన్నికల వేడి కాక పుట్టిస్తోంది. ఇప్పటికే టీఆర్‌ ఎస్‌ అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన భావ సారూప్యతలేని పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు కూటమిలో సీట్ల కుంపట్లు రగులుతూనే ఉన్నాయి. సీట్ల సర్దుబాట్లతో త్యాగాలు చేయాల్సి వచ్చిన స్థానిక నాయకులు రెబెల్‌ స్టార్లుగా రంగంలోకి దిగబోతున్నారు. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ తనకు పంపకాల్లో వచ్చిన 14 సీట్లకుగాను 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆయా స్థానాల్లో అసమ్మతి సెగలు రాజుకుంటుండగానే.. కూకట్‌ పల్లి స్థానాన్ని నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కేటాయించింది. అక్కడ టికెట్‌ ఆశిస్తున్న పెద్ది రెడ్డి మొదట్లో కాస్త కస్సుబుస్సుమన్నా నందమూరి కుటుంబంపై ఉన్న అభిమానంతో మెత్త బడ్డారు. ఇదే సమయంలో నందమూరి హరికృష్ణ తనయులు కల్యాణ్‌ రామ్ - జూనియర్‌ ఎన్‌ టీఆర్‌ సైతం తమ సోదరిని ఆశీర్వదించాలని కోరారు. ఇంత వరకు బాగానే ఉన్నా రాజకీయాలపై పట్టులేని సుహాసినికి అన్నీ బాగానే ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తన మామ చంద్రబాబు నుంచే పెద్ద చుక్క ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

సుహాసినికి కూకట్‌ పల్లి స్థానాన్ని కేటాయించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ జనాభా అధికంగా ఉంటారు. ఈ నియోజకవర్గంలోని అభ్యర్థి విజయంలో వీరి పాత్ర కీలకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అన్ని సర్వేలు సైతం రానున్న ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేక సంకేతాలిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి తారస్థాయికి చేరింది. ఇసుక నుంచి రేషన్‌ బియ్యం వరకు అన్నింటిలోనూ వారి అక్రమాల గుట్టలు పుట్టలు పగులుతున్నాయి. మరో వైపు ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 300 రోజులుగా ప్రజా సంకల్పయాత్ర పేరిట ప్రజల్లో మమేకమై నడుస్తున్నారు. రోజురోజుకూ ఆయనకు ప్రజాదరణ పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఆయనపై కోడి కత్తితో హత్యాయత్నం జరగడం.. విచారణ చేయకుండా ఘటన జరిగిన గంటలో ఇది అభిమాని దాడిగా డీజీపీ ఠాకూర్ - సీఎం చంద్రబాబు - మంత్రులు చిత్రీకరించడం చూస్తుంటే.. ఈ ఘటన వెనుక కచ్చితంగా కుట్ర దాగుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అనంతరం ప్రతిపక్షాలు సీబీఐ విచారణ చేయాలని గగ్గోలు పెట్టినా పెడచెవిన పెట్టిన చంద్రబాబు.. తాజాగా రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ జీవో జారీ చేశారు. తప్పు చేయనప్పుడు అంత ఉలుకెందుకని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ తరహా రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చేటని మేధావి వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మరో వైపు అగ్రిగోల్‌ బాధితుల సమస్యలు పట్టించుకోకపోవడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం రద్దుపై స్పందించకపోవడం, మాగాణికి పంటలకు నీళ్లివ్వకపోవడంతో అన్ని వర్గాలూ గుర్రుగా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును గద్దె దించుతామని శపథం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కూకట్‌ పల్లిలో అధికంగా ఉన్న ఏపీ ప్రజలు.. ఇక్కడి పరిస్థితులన్నింటికీ నిశితంగా పరిశీలిస్తున్నారు. గతంలో హరికృష్ణను సైతం టీడీపీ నుంచి గెంటేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన కుమార్తెకు టికెట్‌ ఇవ్వడం స్వార్థపూరితమేనని సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇలా బాబుపై వ్యతిరేకత సుహాసిని ఓటు బ్యాంకుకు నష్టం చేకూర్చే అవకాశముందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసే ఇప్పటి వరకు రాజకీయాలపై నోరు మెదపని తన తమ్ముళ్లు కల్యాణ్‌ రామ్ - జూనియర్‌ ఎన్టీఆర్‌ ల సహకారాన్ని సుహాసిని కోరినట్లు సమాచారం.