Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ వాడేస్తారా?

By:  Tupaki Desk   |   21 Oct 2018 9:59 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ వాడేస్తారా?
X
2009 ఎన్నికల్లో ఏమీ ఆశించకుండా ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ప్రచారం చేసి పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ ప్రచారంలో భాగంగానే రోడ్డు ప్రమాదానికి కూడా గురై ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. గాయాలతో ఆసుపత్రి బెడ్ మీది నుంచే మరోసారి ప్రచారం కూడా చేశాడు. అతను అంత చేస్తే ఆ ఎన్నికల్లో ఓటమిని అతడికి ముడిపెట్టి.. పక్కన పెట్టేసింది తెలుగుదేశం పార్టీ. 2009 ఎన్నికల్లో ఓటమికి కారణాలేంటన్నది అందరికీ తెలుసు. మహా కూటమి అంటూ అన్ని పార్టీలూ ఒక్కటైనా.. జనాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన మెచ్చి మరోసారి ఆయనకే పట్టం కట్టారు. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం ఎన్టీఆర్ వల్ల తమ పార్టీకి ఒరిగిందేమీ లేదని అతడిని తీసి పడేశారు. ఎవ్వరినైనా అవసరానికి వాడుకుని వదిలేయడం అలవాటైన చంద్రబాబు నాయుడు.. తారక్ విషయంలోనూ మరోసారి తన నైజం చూపించారు.

ఐదేళ్ల కిందట అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తారక్‌ కు తెలుగుదేశం పార్టీ ఏ విధమైన సాయం చేసింది లేదు. పైగా అతడి సినిమాలు విడుదలైనపుడు నెగెటివ్ ప్రచారం చేయడం.. అడ్డంకులు సృష్టించడం కూడా జరిగింది. ఇది బహిరంగ రహస్యం. చంద్రబాబు వియ్యకుండు కమ్ బావమరిది బాలయ్య.. ఎన్టీఆర్‌ను ఎలా పూచిక పుల్లలా తీసిపడేశాడో అందరికీ తెలుసు. గత ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడా అని అడిగితే.. రుసరుసలాడాడు. మిగతా సందర్భాల్లో కూడా తారక్‌ ను అలుసుగానే తీసుకున్నాడు. ఎన్టీఆర్ పిలిచాడో లేదో కానీ.. అతడి సినిమాలకు సంబంధించిన వేడుకల్లో కానీ.. ఇంట్లో జరిగిన కార్యక్రమాల్లో కానీ.. బాలయ్య కనిపించలేదు. కానీ ఇప్పుడు ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌ కు రాబోతున్నాడు.

ఈ నేపథ్యంలో జనాల్లో రకరకాల సందేహాలు నెలకొన్నాయి. 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీకి ఎన్టీఆర్ అవసరం ఉందని భావిస్తున్న చంద్రబాబే.. బాలయ్యను ఈ వేడుకకు పంపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెదేపాపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడం.. ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ - అటు జనసేన సెగ తాకుతుండటంతో గెలుపు అంత తేలిక కాదని భావిస్తున్న బాబు.. యువతలో మంచి ఫాలోయంగ్ ఉన్న ఎన్టీఆర్‌ ను మళ్లీ మచ్చిక చేసుకుని ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని అనుకుంటున్నారని.. ఈ నేపథ్యంలోనే బాలయ్య ‘అరవింద సమేత’ వేడుకకు వస్తున్నాడని.. రాబోయే రోజుల్లో బాలయ్య సహా తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్‌ తో సన్నిహితంగా మెలిగే అవకాశం ఉండొచ్చని.. కాబట్టి ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉండాలని చర్చ నడుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.. ఎన్టీఆర్ వీళ్లతో ఎలా వ్యవహరిస్తాడో?