Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకు కోపం వ‌చ్చి టీవీ ఆపేశారా..!

By:  Tupaki Desk   |   30 July 2016 11:22 AM GMT
చంద్ర‌బాబుకు కోపం వ‌చ్చి టీవీ ఆపేశారా..!
X
గ‌త రెండు రోజులుగా ఏపీని కుదిపేస్తున్న ప్ర‌త్యేక హోదా విష‌యం ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా లేదు. ఒక ప‌క్క అధికార టీడీపీ - మ‌రోప‌క్క విప‌క్షాలూ త‌మ‌దైన శైలిలో ఈ హోదాపై తీవ్రంగానే స్పందిస్తున్నాయి. తాజాగా శ‌నివారం త‌న అనుచ‌రుల‌తో మాట్లాడిన ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ్య‌స‌భ‌లో కేంద్రం అనుస‌రించిన వైఖ‌రిని తీవ్ర‌స్థాయిలో త‌ప్పుప‌ట్టార‌ట‌. హోదా విష‌యంలో ఇన్నాళ్లూ ఊరించి ఆఖ‌రికి కేంద్రం చేతులెత్తేయ‌డం స‌మంజ‌సంగా లేద‌ని మండిప‌డ్డార‌ట‌. రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ ఎంతో అర్ధ‌వంతంగా ఉంటుంద‌ని - కేంద్రం ఏదో ఒక ప‌రిష్కారం చూపుతుంద‌ని తాను భావించాన‌ని అయితే, రాజ్య‌స‌భ‌లో జైట్లీ ప్ర‌సంగం ప్రారంభించి చెప్పిన తొలి మాట‌తోనే తాను విర‌క్తి చెంది టీవీ కూడా ఆపేసి బ‌య‌ట‌కు వ‌చ్చేశాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట సీఎం చంద్ర‌బాబు.

హోదా విష‌యం మాట్లాడ‌డ‌మంటే అంతిచ్చాం.. ఇంతిచ్చాం.. అంటూ లేనిపోని లెక్క‌లు చెబుతున్నార‌ని చంద్ర‌బాబు ఫైర‌య్యార‌ట‌. ఈ రెండేళ్ల‌లో ఏపీకి 2 ల‌క్ష‌ల కోట్లు ఇచ్చామ‌ని చెబుతున్నార‌ని, అయితే, ఇవి సాధార‌ణంగా అన్ని రాష్ట్రాల‌కూ ఇచ్చేవేన‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందరికీ ఇచ్చేదే ఇస్తూ హోదా కంటే ఎక్కువ చేస్తున్నామని ఎలా అంటారు? కావాలంటే ఏ రాష్ట్రానికి కేంద్రం ఎంతిచ్చిందో చూడండని అన్నారు. ప్ర‌త్యేక హోదాకి, 14వ ఆర్థిక సంఘానికి సంబంధం ఏంటో చెప్పాల‌ని కూడా కేంద్రాన్ని ఆయ‌న డిమాండ్ చేశారు. అయితే, సీపీఎం స‌భ్యుడు సీతారాం ఏచూరి ప్ర‌త్యేక హోదాపై అత్యంత అర్థ‌వంతంగా మాట్లాడార‌ని చంద్ర‌బాబు కితాబివ్వ‌డం గ‌మ‌నార్హం.

పోనీ ఏచూరి చెప్పిన‌ట్టు ఏదైనా క‌మిటీని వేసినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని, ఆ క‌మిటీ చెప్పిన ప్ర‌కారం కేంద్రం న‌డుచుకుంటామ‌ని ప్ర‌క‌టించినా.. తాము సంతోషిస్తామ‌న్నారు చంద్ర‌బాబు. ఇక కాంగ్రెస్ - వైకాపాలు డ్రామాలు ఆపితే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. విభ‌జ‌న చేసిందే కాంగ్రెస్ అని, అప్పుడు గిల్లిన ఈ పార్టీయే ఇప్పుడు జోల‌పాట పాడుతోంద‌ని ఎద్దేవా చేశారు సీఎం. అసలు మీరు సరిగ్గా చేస్తే ఇప్పుడు ఈ ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టాల్సి వచ్చేది. అని కాంగ్రెస్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విభ‌జ‌న స‌మ‌యంలోనే ప్ర‌త్యేక హోదా అంశాన్ని చ‌ట్టంలో పెట్టి ఉంటే ఇప్పుడీ బాధ ఉండేది కాద‌ని చంద్ర‌బాబు అన‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా హోదా విష‌యంలో బీజేపీతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీగానే ఉన్నారు.