Begin typing your search above and press return to search.

వేలకోట్లు వచ్చినా.. ఏం జరుగుతుందంటే..

By:  Tupaki Desk   |   7 April 2018 7:24 AM GMT
వేలకోట్లు వచ్చినా.. ఏం జరుగుతుందంటే..
X
చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి, కేంద్రంలోని మోడీసర్కారుకు మధ్య బంధం చెడిన తర్వాత.. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని సమూలంగా బద్నాం చేయడంలో చంద్రబాబు చాలా సక్సెస్ అయ్యారు. అయితే.. అదే సమయంలో.. చంద్రబాబు అవినీతిని ఎండగట్టడంలో కూడా రాష్ట్ర భాజపా నాయకులు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భాజపా నాయకులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణల్లో.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అంచనాలను రివైజ్ చేసే పేరిట.. వందల వేల కోట్లరూపాయలను చంద్రబాబు ప్రభుత్వం స్వాహా చేసేస్తున్నది అనేది ప్రధానమైన ఆరోపణ. తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కాగ్ నివేదికను గమనించినప్పుడు భాజపా నాయకుల ఆరోపణలు అక్షరసత్యాలే ఏమో అని ప్రజలు అనుకుంటున్నారు.

సభలో ప్రవేశ పెట్టిన కాగ్ నివేదిక చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనలోని అనేకానేక లోపాలను తీవ్రంగా ఎండగట్టింది. పరిపాలనలోపాల వల్ల.. వేల కోట్ల రూపాయలు వృథా అవుతున్నట్లుగా కాగ్ నిగ్గు తేల్చింది.

సాధారణంగా నీటి ప్రాజెక్టుల్లో అంచనా బడ్జెట్ లను సవరించడం అంటేనే.. అది అధికార పార్టీల స్వాహా వ్యవహారంలో భాగం అని పలువురు భావిస్తుంటారు. ఆ కోణంలోంచి చూసినప్పుడు.. రాష్ట్రప్రభుత్వం కేవలం 2016-17 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 28 వేల కోట్ల రూపాయల మేరకు అంచనాలను పెంచేసినట్లుగా కాగ్ నివేదిక పేర్కొంటున్నది.

ఈ లెక్కన ప్రజలు భయపడుతున్నది ఏంటంటే.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం కోర్ కేపిటల్ నిర్మాణానికి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందంటూ.. ఆ మొత్తం భరించాలని కేంద్రాన్ని అడుగుతోంది. అదే సమయంలో మొత్తం రాజధానికి లక్ష కోట్లు అవుతుందంటూ.. ప్రజలనుంచి రుణాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నది.

కాగ్ తప్పుపట్టిన రకంగా.. ఏడాదిలో 28వేల కోట్లు అంచనాలు పెంచేసే ప్రభుత్వానికి ఎన్నివేల కోట్లు ఇచ్చినా.. జరిగేది ఇలాంటి స్వాహాపర్వమే కదా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. పట్టిసీమ దగ్గరినుంచి సాగునీటి ప్రాజెక్టుల ప్రతి పనిలోనూ నిధుల స్వాహా విపరీతంగా జరిగిందని.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తొలినుంచి చెబుతూనే ఉన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం అవినీతి మయం అయిపోయిందని.. పవన్ కల్యాణ్ ఇటీవలే దాడి ప్రారంభించారు. మరి చంద్రబాబు జనాలకు ఏం సమాధానం చెప్పుకుంటారో చూడాలి.