Begin typing your search above and press return to search.

బాబు ఆశించిందొక్కటి.. జరిగిందొక్కటి

By:  Tupaki Desk   |   21 April 2018 8:43 AM GMT
బాబు ఆశించిందొక్కటి.. జరిగిందొక్కటి
X

ధర్మ పోరాట దీక్ష పేరుతో నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమం ఏమేరకు విజయవంతం అయిందో తెలుగుదేశం పార్టీ వర్గాలకు కూడా అర్థం కాకుండా ఉంది. నిన్న ఈ దీక్ష జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులు.. అభిమానులతో కలిసి ఫిలిం ఛాంబర్ దగ్గర హడావుడి చేయడంతో మీడియా ఫోకస్ మొత్తం దాని మీదే నిలిచింది. సోషల్ మీడియా ట్రెండ్స్‌ లో కూడా అదే హాట్ టాపిక్ అయింది. ధర్మ పోరాట దీక్షకు ఆశించినంత మీడియా కవరేజీ దక్కలేదు. దీక్షకు జనాల నుంచి స్పందన కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇదేదో పార్టీ కార్యక్రమంలా అనిపించింది తప్ప.. ఇందులో జనాల ప్రమేయం అంతగా కనిపించలేదు.

అయినా ఒక 12 గంటలు ఇలా దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి.. కేంద్రంలో ఇదేమైనా కదలిక తెస్తుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు ఈ దీక్ష అయ్యాక దీని ఉద్దేశాల మీద ఏమాత్రం చర్చ జరగట్లేదు. మొత్తం ఫోకస్ అంతా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీదికి మళ్లింది. చంద్రబాబు నాలుగేళ్లుగా మోడీతో అంటకాగి.. ఆయనతో చాలా మర్యాదగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ మధ్య స్వరం పెంచినా.. మాటలు హద్దుల్లోనే ఉంటున్నాయి. కానీ ఇప్పుడు బాలయ్య వచ్చి శిఖండి అని.. కొజ్జా అని మోడీనుద్దేశించి మాట తూలేశాడు. మోడీని తరిమి తరిమి కొడతానన్నాడు. ఇంకా ‘మాకీ..’ అంటూ అసందర్భోచితంగా హిందీలో పెద్ద బూతు పదాన్ని కూడా ప్రయోగించాడు. ఇది తీవ్ర దుమారమే రేపుతోంది. మోడీ మీద ఎంత కోపం ఉన్నప్పటికీ ఆయన మన ప్రధాని. అలాంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. మోడీ బద్ధ శత్రువులు సైతం ఇలా మాట్లాడరు. బాలయ్యకు మైకిస్తే ఏం మాట్లాడతాడో అర్థం కాదన్న అభిప్రాయాలు ముందు నుంచి ఉన్నాయి. సినీ వేడుకల్లో ఆయన ప్రసంగాలు కూడా గతంలో చాలా వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష అని పేరు పెట్టుకున్న కార్యక్రమంలో బాలయ్య ఏదేదో వాగేసి బాబుకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఈ దీక్ష వల్ల సానుకూలతలు కనిపించకపోగా బాలయ్య వ్యాఖ్యలతో కొత్త ఇష్యూ తెరపైకి రావడంతో చంద్రబాబు తలపట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.