Begin typing your search above and press return to search.

మోడీకి బొకే ఇచ్చి.. చంద్రబాబు ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   6 Oct 2015 3:51 AM GMT
మోడీకి బొకే ఇచ్చి.. చంద్రబాబు ఏం చెప్పారు?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చేసిన ఢిల్లీ పర్యటనకు ఈసారి పర్యటనకు కాస్త తేడా ఉందని చెప్పాలి. ఈసారి ఆయన.. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సింది ఆహ్వానించే పనినే ప్రధానంగా పెట్టుకున్నారు. ప్రధాని మోడీకి కలిసిన ఆయన.. చేతికి బొకే ఇచ్చి.. అమరావతి శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

యథావిధిగా ప్రధాని మోడీ సైతం నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చేశారు. అమరావతి శంకుస్థాపనకు తాను తప్పనిసరిగా వస్తానని చెప్పారు. ఈ సందర్భంగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్న విషయాన్ని మోడీకి వివరించారు.

ఈ సందర్భంగా అమరావతి శంకుస్థాపనకు సంబంధించి పలు ప్రశ్నలు వేసి.. బాబు చెప్పే సమాధానాల్ని చాలా ఆసక్తికరంగా విన్నట్లుగా చెబుతున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ ప్రజలందరిని భాగస్వామ్యం చేస్తున్నమని చెప్పిన చంద్రబాబు.. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిలు.. మసీదులు.. దేవాలయాల్లో పూజలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం తయారు చేసిన ప్లాన్ ను కూడా పంపుతానని మోడీకి చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్లాన్ ను చూసిన తర్వాత ఏమైనా మార్పులు ఉంటే చెప్పాలని పేర్కొన్నట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానానికి మోడీ సానుకూలంగా స్పందించటంతో పాటు.. తాను తప్పనిసరిగా వస్తానని చెప్పినట్లు చంద్రబాబు వెల్లడించారు. అదే రోజు తాను తిరుపతికి కూడా వెళ్లాలన్న విషయాన్ని మోడీ తనకు చెప్పినట్లు బాబు వెల్లడించారు.

అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యేందుకు మోడీని ఆహ్వానించిన సందర్భంగా అర్థమైన కొత్త విషయం ఏమిటంటే.. అమరావతి నిర్మాణానికి సంబంధించి మొత్తం నిర్ణయాల్ని తాను మాత్రమే తీసుకున్నానని.. ఇంకెవరికి చంద్రబాబు అవకాశం ఇవ్వలేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. సింగపూర్ పంపిన ప్లాన్ ఇప్పుడు పంపుతానని ప్రధానికి చెప్పటం అంటే.. రాజధాని నిర్మాణం విషయంలో మోడీ జోక్యం ఏమీ లేదని తేలిపోతుంది. కేవలం మర్యాదపూర్వకంగానే బాబు.. మోడీతో మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. పరస్పర గౌరవం మాత్రమే ఇచ్చుకునే మైత్రి ఏమాత్రం ప్రయోజనం చేకూరదన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.