పక్కోళ్లను వదిలి సొంతోళ్ల మీద కన్నేయాలి బాబు

Sun Jul 16 2017 12:41:24 GMT+0530 (IST)

పక్కింటి వైపు కన్ను వేసే ముందు.. సొంతింటిని సరిగా సర్దుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటి పని అస్సలు చేయటం లేదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో తిరుగులేని అధికారంలో ఉన్నట్లు చెప్పుకునే ఏపీ అధికారపక్షం మాటలకు.. వాస్తవాలకు పొంతనే లేదని చెబుతున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ ఆ పార్టీ నేతల మధ్య సరైన సంబంధాలు లేవని.. ఎక్కడికక్కడే అసంతృప్తి ఉందన్న అభిప్రాయం ఉంది. పార్టీలో అంతకంతకూ పెరిగిపోతున్న గ్రూపుల్ని ఒక కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉన్నా.. పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆ పని చేయం లేదని చెబుతున్నారు. ఇప్పటికే  తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజల్ని సంతృప్తి పర్చాల్సిన అధికారపక్షం ఆ విషయాన్ని వదిలేసి.. విపక్షం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల మీద కన్నేయటంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. విపక్షం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని.. వచ్చే ఎన్నికల నాటికి ఆ స్థానాల్లో పచ్చ జెండా ఎగరాలన్న మాటల్ని పార్టీ వర్గాలకు బాబు చెబుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇక్కడ సమస్య ఏమిటంటే.. విపక్షం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్ని వదిలేసి.. ముందు అధికారపక్షం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని.. అక్కడి అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలన్న సూచనను పలువురు చేస్తున్నారు. సొంతింటిని చక్కదిద్దుకోవటం రాని చంద్రబాబు.. పక్కింటిపై కన్ను వేయటంలో అర్థం లేదన్న మాట వినిపిస్తోంది.  మిగిలిన జిల్లాల్ని వదిలేసి.. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులోనే ఇలాంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలను ఏర్పాటు చేయలేదన్న మాట వినిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందని చెబుతున్నారు. కొన్ని స్థానాల్లో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసే అవకాశం కూడా లేదన్న మాటను చెబుతున్నారని.. వారి స్థానంలో వారి వారసుల్ని తయారు చేసే పని కూడా జోరుగా సాగటం లేదన్న మాట వినిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా సమాచారం తాను చెప్పించుకుంటున్నానని.. ఇన్ ఛార్జీల పని తీరును మదింపు చేస్తున్నట్లుగా చెప్పే చంద్రబాబు.. ఆ మాటలే నిజమైతే.. ముందు సొంత జిల్లా ముచ్చట చూడాలని సూచన చేస్తున్నారు. సొంత జిల్లాను సరిగా సర్దలేని చంద్రబాబు.. మిగిలిన జిల్లాల్ని ఎప్పుడు చూస్తారు?

విపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గాల మీద ఎప్పుడు ఫోకస్ చేసి.. పట్టు పెంచుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అన్నింటికి మించి.. పక్కింటి మీద కన్నేసే ముందు.. సొంతింటి సంగతి పూర్తి చూస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.