Begin typing your search above and press return to search.

ఐపీఎస్ ల సంఘాన్ని చంద్రబాబు బెదిరించారా?

By:  Tupaki Desk   |   27 March 2017 6:21 AM GMT
ఐపీఎస్ ల సంఘాన్ని చంద్రబాబు బెదిరించారా?
X
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... ఆయన గొంతు విప్పితే గూండాల గుండెల్లో గుళ్ల సౌండు వినిపించేంది. ఈసరికే అర్థమై ఉంటుంది.. ఈ బాలసుబ్రహ్మణ్యం గాయకుడు కాదని.. ప్రకాశం జిల్లాతో పాటు తెలుగు నేలన పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసి ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న డేరింగ్ పోలీస్ ఆఫీసర్ అని. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా, ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా చక్కదిద్దగల దిట్టగా ఆయనకు పేరుంది. మావోయిస్టులు, అరాచక శక్తులకు టెర్రర్‌ పుట్టించే ట్రాక్‌ రికార్డు ఉంది. మచ్చ లేని కెరీర్ ఆయన సొంతం. ప్రస్తుతం ఆయన రవాణా శాఖకు కమిషనర్. అలాంటి బాలసుబ్రమణ్యాన్ని ఓ టీడీపీ ఎంపీ అత్యంత దారుణంగా దూషించడం తెలిసిందే. దీనిపై అధికారవర్గాల్లో ఒక్కసారిగా నిరసన మొదలైంది.. కానీ, అంతలోనే సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని ఆ ఎంపీతో క్షమాపణలు చెప్పించేసరికి అంతా సద్దుమణిగిపోయింది. ముక్కుసూటి మనిషి - నిజాయితీపరుడు - మాటపడడానికి ఏమాత్రం ఇష్టపడని ఆఫీసర్ గా పేరున్న బాలసుబ్రమణ్యం ఒక్కసారిగా ఇలా నీరు గారిపోవడంపై అధికార వర్గాల్లో చర్చజరుగుతోంది. అంతేకాదు.. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి ఇంత అవమానం జరిగితే ఐపీఎస్ అధికారుల సంఘం ఎందుకు స్పందించలేదన్న ప్రశ్న వినిపిస్తోంది.

అవినీతి మ‌యంగా ఉండే ర‌వాణాశాఖ‌ను దారిలో పెట్టడానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు బాలసుబ్రహ్మణ్యంను క‌మిష‌న‌ర్‌ గా నియ‌మించారు. చ‌ట్టానికి లోబ‌డి - నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌డుచుకోవ‌డం, చ‌ట్టానికి లోబ‌డి ప‌నిచేయ‌డం ఆయ‌న‌నైజం. అలాంటి అధికారిని బెదిరించి, దౌర్జ‌న్యం చేసి, చ‌ట్టంతో ప‌నిలేద‌ని,తాము చెప్పినట్టే ఫైలు రూపొందించాల‌ని ఆదేశించారు విజ‌య‌వాడ ఎంపీ - కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని. ఈయ‌న‌కు తోడు ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దావెంక‌న్న‌,ఇత‌ర నాయ‌కులు కూడా తోడ‌య్యారు. తాము చెప్పిన‌ట్లు న‌డుచుకోవ‌డం లేద‌ని క‌మిష‌న‌ర్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంపై వారు దౌర్జ‌న్యం చేయడం మొత్తం మీడియాలో వచ్చేసింది. కానీ.. సీనియ‌ర్ ఐ.పి.ఎస్‌. అధికారిపై ఇలాంటి దారుణానికి పాల్ప‌డినా ఐ.పి.ఎస్‌. సంఘం నేత‌లు ఎవ‌రూ ఇంకా స్పందించ‌లేదు. ఇటీవ‌ల బ‌స్సు ప్ర‌మాదంలో మృతిచెంది,క్ష‌త‌గాత్రులుగా ఉండి,ఆసుప్ర‌తిలో చికిత్స‌పొందుతున్న వారిని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైసిపి అధినేత జ‌గ‌న్‌ ను అక్క‌డ ఉన్న కృష్ణాజిల్లా క‌లెక్ట‌ర్ బాబుతో మాట్లాడిన విధానాన్ని వివాదం చేసి... ఐఏఎస్ అధికారిపై దౌర్జ‌న్యం చేశార‌ని, క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఐఏఎస్ ల సంఘం స్పందించింది. అస‌లు అపుడు జ‌రిగిన దానికంటే ఎంపీ కేశినేని నాని ,అనుచ‌ర గ‌ణం చేసింది చాలా ఎక్కువ‌. అయినా సంఘాలు కిక్కురుమనలేదు. క‌మిష‌న‌ర్‌ ని నిర్బందించి, ఆయ‌న గ‌న్‌ మెన్‌ పై చేయి చేసుకున్నా ఐపీఎస్‌ ల సంఘం స్పందించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి? అధికార‌పార్టీ ఎంపీ అనే భ‌య‌మా? అన్న చర్చ జరుగుతోంది.

అంతేకాదు.. జగన్ ఇష్యూలో ఐఏఎస్ ల సంఘంపై చంద్రబాబు ఒత్తిడి చేసి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడించారని.. ఇప్పుడు ఐపీఎస్ ల సంఘంపైనా ఒత్తిడి చేసి ఈ ఇష్యూలో స్పందించకుండా ఆపారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే జ‌రిగితే రాబోయే రోజుల్లో ఎవ‌రైనా ఈరాష్ర్టంలో ప‌నిచేయ‌గ‌లుగుతారా? ఐఏఎస్‌, ఐపీఎస్‌ ల‌కే ప‌నిచేసే స్వేచ్చ‌లేక‌పోతే, ఇంకా కిందిస్థాయి అధికారుల ప‌రిస్థితి ఏమిటి? ఐపీఎస్‌ ల సంఘం ఇంకా మౌన‌ముద్ర‌లో ఉంటే పరిస్థితులు చేయి దాటిపోతాయి. ప్రభుత్వాలు మారినా ఐపీఎస్‌, ఐఏఎస్‌ లు ఇత‌ర అధికారులు సుదీర్ఘ‌కాలం ఉంటారు. అధికారులు ప‌నిచేయ‌డానికి నిబంధ‌న‌లు ఉంటాయి. చ‌ట్టానికి లోబ‌డి ప‌నిచేయాల్సి ఉంటుంది. ఒత్తిళ్లకు తలొగ్గితే నిత్యం తల వంచుకు వెళ్లాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/