Begin typing your search above and press return to search.

ఆత్మ రక్షణలో చంద్రబాబు

By:  Tupaki Desk   |   1 Sep 2015 10:20 AM GMT
ఆత్మ రక్షణలో చంద్రబాబు
X
అసెంబ్లీలో ఈసారి విభిన్నమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం, పార్టీ ఆ పార్టీ నేతలు ఈసారి ఆత్మ రక్షణలో పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకూ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత జగన్ ఆత్మ రక్షణలో ఉండేవాడు. చంద్రబాబు సహా టీడీపీ నేతలు జగన్ పై కేసుల గురించి మాట్లాడితే ఆయన రెచ్చిపోయి విమర్శలు చేసేవాడు. దాంతో ప్రజల్లో బద్నాం అయ్యేవాడు. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

ఓటుకు నోటు కేసు కారణంగా ఇప్పుడు ప్రభుత్వమే ఆత్మ రక్షణలో పడాల్సి వస్తోంది. ప్రత్యేక హెదా పై చర్చలో భాగంగా జగన్ ఈ కేసును పదే పదే ప్రస్తావించాడు. తనపై కేసులు ఉన్నాయని విమర్శలు చేశారని, కానీ ఇప్పుడు చంద్రబాబు పైనా కేసులు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు వాటి నుంచి బయట పడడానికి మోదీ ముందు మోకరిల్లారని, అందుకే ప్రత్యేక హోదాను పణంగా పెట్టారని విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో అందుకే తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్దిష్ట కాల వ్యవధి పెట్టి మోదీ సర్కారుకు డెడ్ లైన్ విధించగలరా అని సవాల్ చేశారు.

జగన్ వ్యాఖ్యలతో చంద్రబాబు సహా అధికార పక్ష నేతలు ఇరుకున పడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు విచిత్రమైన వాదనను తెరపైకి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, అక్కడ సెక్షన్ 8 అమల్లో ఉందని, ఉమ్మడి రాజధానిలో తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన ఎమ్మెల్యేలను కానీ ముఖ్యమంత్రిని కానీ ఇరుకున పెట్టినప్పుడు ప్రతిపక్ష వైసీపీ కూడా ప్రభుత్వానికి అండగా వచ్చి తెలంగాణ ప్రభుత్వంపై పోరాడాలని వ్యాఖ్యనించారు. దాంతో, మీకు ఎమ్మెల్యేలకు లంచాలు ఇస్తూ వారిని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తే.. ఆ అక్రమాలను సమర్థిస్తూ మేము ప్రభుత్వంతో పోరాడాలా అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి మొన్నటి వరకు జగన్ ను కేసుల విషయంలో ఇరుకున పెట్టిన ఏపీ సర్కారు ఇప్పుడు స్వయంగా తాను కూడా ఆత్మ రక్షణలో పడింది.